Telugu Global
NEWS

బీజేపీ వర్సెస్ మజ్లిస్... తెలంగాణలో విచిత్రమైన పోటీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓ విచిత్రమైన రాజకీయ వాతావరణం.. ఆసక్తిని కలిగిస్తోంది. ఎప్పటిలాగే.. టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా రాజకీయాలు చేస్తుంటే.. ఇతర పార్టీలు మాత్రం రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఇంకో వైపు.. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు నిజమైతే.. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేందుకూ కాంగ్రెస్ కు అభ్యర్థులు కరువైన తీరు.. ఆ పార్టీ కేడర్ ను అయోమయంలోకి నెట్టేస్తోంది. ఇటు.. టీడీపీ సంగతి సరే సరి. ఆ పార్టీ పరిస్థితి ఏంటో జనానికి […]

బీజేపీ వర్సెస్ మజ్లిస్... తెలంగాణలో విచిత్రమైన పోటీ
X

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓ విచిత్రమైన రాజకీయ వాతావరణం.. ఆసక్తిని కలిగిస్తోంది. ఎప్పటిలాగే.. టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా రాజకీయాలు చేస్తుంటే.. ఇతర పార్టీలు మాత్రం రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఇంకో వైపు.. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు నిజమైతే.. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేందుకూ కాంగ్రెస్ కు అభ్యర్థులు కరువైన తీరు.. ఆ పార్టీ కేడర్ ను అయోమయంలోకి నెట్టేస్తోంది.

ఇటు.. టీడీపీ సంగతి సరే సరి. ఆ పార్టీ పరిస్థితి ఏంటో జనానికి కాదు. ఇంకా మిగిలి ఉన్న నాయకులకే అర్థం కావడం లేదు. సీనియర్లు తప్ప.. ద్వితీయ శ్రేణి నాయకత్వంలో గుర్తించదగ్గ నేతలు ఎంత మాత్రం ఆ పార్టీలో లేరు. సీపీఐ, సీపీఎం బలం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అన్నట్టు ఆ పార్టీ నేతల రాజకీయాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఏదో చేస్తారని ఆశించిన కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి కూడా.. అనుకున్నంతగా జనంలోకి వెళ్లలేకపోతోంది. ఇక మిగిలిన క్రియాశీల రాజకీయ పార్టీలు రెండే రెండు. అవి బీజేపీ, మజ్లిస్.

బీజేపీ నేతల్లో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే.. అట్టడుగు కార్యకర్త వరకూ.. మజ్లిస్ జపమే చేస్తున్నారు. తమకు టీఆర్ఎస్ తో పోటీ లేనే లేదని.. మజ్లిస్ తోనే పోటీ అని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను కాదని.. కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిన మజ్లిస్ తో పోటీ ఏంటో అని జనాలు పెదవి విరుస్తున్నా.. వారి తీరు మాత్రం మారడం లేదు.

ఇక మజ్లిస్ విషయానికి వస్తే.. టీఆర్ఎస్ తో వారికి మాంఛి అవగాహన ఉందన్నది అనధికారిక బహిరంగ రహస్యం. ఫలితంగా భైంసా లాంటి చోట్ల మజ్లిస్ అభ్యర్థులు ఏకగ్రీవం అయిన ఉదంతాలూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో.. మజ్లిస్ వారి చూపు కూడా.. చెప్పినా చెప్పకపోయినా బీజేపీ రాజకీయాలవైపే ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఓవరాల్ గా ఈ సమీకరణాలతో తేలింది ఏంటంటే.. తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత.. రెండో స్థానానికి మజ్లిస్ తో బీజేపీ విపరీతంగా పోటీ పడుతోంది. అంతిమంగా.. ఇది అధికార టీఆర్ఎస్ కు అనుకోకుండా మేలే చేస్తోందని అంతా అనుకుంటున్నారు.

First Published:  20 Jan 2020 12:55 PM GMT
Next Story