ఈ ఏడాది ప్రభాస్ మూవీ లేనట్టే

గతేడాది సాహో సినిమా వచ్చింది. మరోసారి ప్రభాస్ ను పాన్-ఇండియన్ స్టార్ గా నిలబెట్టింది. ఈ ఏడాది రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా రాబోతోందంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ అభిమానులకు చేదువార్త ఇది. ఈ ఏడాది ప్రభాస్ సినిమా థియేటర్లలోకి రావడం లేదు. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.

ఇది ఇంకా జనవరి నెల మాత్రమే. ప్రభాస్ సినిమా సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. సో.. 7-8 నెలలు షూటింగ్ చేసినా సెప్టెంబర్-అక్టోబర్ నాటికి సినిమా రెడీ అయిపోతుందని ఎవరైనా అనుకుంటారు. కానీ ఈ సినిమా నిర్మాత కృష్ణంరాజు మాత్రం ససేమిరా అంటున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రభాస్ సినిమాను విడుదల చేస్తామంటున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. 3 నెలల పాటు రకరకాల సెట్స్ లో ఇక్కడే షూటింగ్ చేస్తారట. ఏప్రిల్, మే నెలల్లో విదేశాలకు షూటింగ్ కు వెళ్తారు. ఆ తర్వాత మరో 3 నెలలు హైదరాబాద్ లోనే షూట్ ఉంటుందట.

అలా ఈ ఏడాది చివరి నాటికి షూట్ కంప్లీట్ చేసి, వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు కృష్ణంరాజు. సో.. ఈ ఏడాది ప్రభాస్ నుంచి సినిమా లేనట్టే.