నిశ్శబ్దంగా వాయిదాపడింది

అనుష్క సినిమా అంటే మార్కెట్లో హాట్ కేక్. ఆమె సినిమా రావడమే ఆలస్యం ఇలా బిజినెస్ అయిపోతుంది. ఫిమేల్ ఓరియంటెండ్ మూవీస్ కు ఆమె కేరాఫ్ గా మారింది. అయితే ఆశ్చర్యకరంగా అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా మాత్రం ఎందుకో స్తబ్ధుగా మారింది. లెక్కప్రకారం, ఈ సినిమా మరో 10 రోజుల్లో (జనవరి 31) విడుదలవ్వాలి. కానీ ఇప్పుడీ మూవీ వాయిదాపడింది. దీనికి కారణం సినిమా బిజినెస్ పూర్తికాకపోవడమే.

అవును.. నిశ్శబ్దం సినిమా బిజినెస్ పూర్తవ్వలేదు. తెలుగులో ఈ సినిమాకు మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. అన్ని భాషల్లో కలిపి ఒకేసారి విడుదల చేయాలనేది మేకర్స్ ఆలోచన. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను పోస్ట్ పోన్ చేశారు.

అనుష్క ఇందులో మూగ అమ్మాయిగా కనిపిస్తోంది. ఈ మేరకు టీజర్ లోనే మేటర్ ను బయటపెట్టారు. మాధవన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో షాలినీ పాండే, అంజలి కీలక పాత్రలు పోషించారు. హేమంత్ మధుకర్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడిసన్ నటించడం ఈ సినిమాకు హైలెట్ గా చెప్పుకోవచ్చు.