ఏపీకి 3 రాజధానులు… కేంద్రం జోక్యంపై క్లారిటీ వచ్చేసింది

ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ నిన్న అసెంబ్లీలో బిల్ పెట్టారు.. దాన్ని ఆమోదించారు కూడా. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ దీన్ని కేంద్రంతో కలిసి నరుక్కురావడానికి రెడీ అయిపోయారు. ఈ మేరకు భీషణ ప్రతిజ్ఞలు చేశారు. ఇంతకీ జగన్ తీసుకొచ్చిన 3 రాజధానులపై కేంద్రం ఏమనుకుంటుదనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇటీవల కాలంలో ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి వారి అనుమతితోనే తాజాగా తమ నిర్ణయం ప్రకటించారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతి ఇచ్చిందని అంతా అనుకున్నారు.

తాజాగా ఏపీకి మూడు రాజధానుల అంశంపై కేంద్రం అభిప్రాయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని.. మోడీషాలు కూడా జగన్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించదని కూడా ఆయన అన్నారు.

ఇప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేయడంతో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని… స్వయంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాదే తనతో చెప్పినట్టు బీజేపీ తెలుగు ఎంపీ జీవీఎల్ నరసింహరావు వెల్లడించారు.

దీంతో ఏపీకి 3 రాజధానులకు బీజేపీ వ్యతిరేకం, అనుకూలం అన్న వార్తలకు చెక్ పడింది. రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిది అని ఈ విషయంలో కేంద్రం జోక్యం లేదని జీవీఎల్ బీజేపీ పార్టీ స్టాండ్ ను బయటపెట్టారు.

తాజాగా పవన్ కళ్యాణ్ తాను ఢిల్లీ వెళ్ళి బిజేపీ పెద్దలతో మాట్లాడి రాజధాని అంశాన్ని తేలుస్తానని వీరంగాలు వేయడం పైన కూడా జీవీఎల్ స్పందించారు. రాజధాని వ్యవహారాలపై బీజేపీ పెద్దలు ఎవరూ రేపు పవన్ కళ్యాణ్ తో మాట్లాడడం లేదని… పార్టీ సమన్వయ కమిటీ సభ్యుల ఎంపికకోసం జరిగే చర్చలకోసం మాత్రమే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వస్తున్నారని…. రాజధాని మార్పుపై కేంద్రం ఎవరితోనూ చర్చలు జరపబోదని… మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఏ స్టాండ్ తీసుకోదని… మూడు రాజధానులకు కేంద్రం అనుకూలం కానీ వ్యతిరేకం కానీ కాదని ఆయన చెప్పారు.