Telugu Global
NEWS

పునర్ వైభవం కోసం.... జేసీ సోదరుల ఆరాటం

తనయుల రాజకీయాల కోసం.. అనంతపురం జిల్లాలో ప్రముఖులైన జేసీ బ్రదర్స్ చేసిన త్యాగం ఉపయోగం లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ.. 2019 నాటికి సైలెంట్ అయ్యారు. కామ్ గా తనయులను తెరపైకి తెచ్చారు. అనంతపురం ఎంపీగా టీడీపీ నుంచి దివాకర్ తనయుడు పవన్.. తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా ప్రభాకర్ తనయుడు అస్మిత్ పోటీ చేశారు. వైసీపీ హవాలో ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే […]

పునర్ వైభవం కోసం.... జేసీ సోదరుల ఆరాటం
X

తనయుల రాజకీయాల కోసం.. అనంతపురం జిల్లాలో ప్రముఖులైన జేసీ బ్రదర్స్ చేసిన త్యాగం ఉపయోగం లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ.. 2019 నాటికి సైలెంట్ అయ్యారు. కామ్ గా తనయులను తెరపైకి తెచ్చారు. అనంతపురం ఎంపీగా టీడీపీ నుంచి దివాకర్ తనయుడు పవన్.. తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా ప్రభాకర్ తనయుడు అస్మిత్ పోటీ చేశారు. వైసీపీ హవాలో ఇద్దరూ ఓడిపోయారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ.. జేసీ బ్రదర్స్ ను మించి.. జూనియర్ జేసీ బ్రదర్స్ హల్ చల్ చేశారు. గెలిచేది మేమే… ఇక రాజకీయం చేసేది మేమే అన్నంతగా వాళ్లు జనాల్లో కలిసిపోయారు. అనంతపురం జిల్లాలో.. ఇక వీరిదేనా రాజకీయం అన్నంతగా.. దూసుకొచ్చారు. ఓ దశలో.. టీడీపీకి గతంలో కీలకంగా ఉన్న పరిటాల రవి కుటుంబాన్ని కాదని మరీ.. తెలుగుదేశం అధినేత జేసీ కుటుంబానికి ప్రాధాన్యత కల్పించారు.

ఇంతా చేస్తే.. ఎన్నికల్లో పవన్, అస్మిత్ కు ఎదురైన ఓటమి.. అనంతపురం జిల్లాలో.. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబానికి గొడ్డలిపెట్టుగా మారింది. రాజకీయాల్లో అంతగా తలపండని ఆ యువకులను పోటీ చేయించిన పాపానికి జేసీ దివాకర్, ప్రభాకర్ సోదర ద్వయానికి నిరాశే మిగిలింది. ఇది.. సహజంగానే అనుచరవర్గం ఆలోచనలోనూ మార్పు తెచ్చింది. చాలా వరకు.. తమకు నచ్చిన చోటికి వెళ్లిపోగా.. మిగిలిన కేడర్ ను కాపాడుకునేందుకు జేసీ సోదరులు నానా తంటాలు పడాల్సి వస్తోంది.

ఈ పరిస్థితి నుంచి కేడర్ లో ఉత్సాహం పెంచేందుకే.. తాడిపత్రిలో ప్రభాకర్, రాష్ట్ర వ్యాప్తంగా దివాకర్ యాక్టివ్ అయ్యారని కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు మేలుకోకుంటే.. రేపు తమ తరానికి రాజకీయ అవకాశాలు కష్టమే అన్న భావన వారిలో నెలకొందన్న అభిప్రాయం.. ఆయా కథనాల ద్వారా వ్యక్తమవుతోంది. అందుకే.. తమ రాజకీయ పునర్ వైభవం కోసం నేరుగా సీనియర్ జేసీ బ్రదర్సే రంగంలోకి దిగినట్టుగా అనంతపురం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

First Published:  20 Jan 2020 8:01 PM GMT
Next Story