రచ్చకెక్కిన ‘మా’ లొల్లి…. మరో దుమారం

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మరో దుమారం చెలరేగింది. ఇప్పటికే అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు జీవితా రాజశేఖర్ వర్గాలు పైసల కోసం గొడవపడి రచ్చ కెక్కిన సంగతి తెలిసిందే. చిరంజీవి సాక్షిగా రాజశేఖర్ చేసిన రచ్చను ఎవరూ మరిచిపోలేదు.

అయితే తాజాగా వీరి ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. రెండు రోజులుగా వీరి మధ్య గొడవలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయాన్ని మూసివేశారు. ఈ విషయంపై పెద్దలు సర్ధి చెప్పినా ‘మా’ కార్యాలయాన్ని తీయడానికి ఎవరూ ముందుకు రావడం లేదట.. కార్యవర్గ సభ్యులు సైతం ఈ విషయంపై స్పందించకపోవడంతో టాలీవుడ్ లో దుమారం రేగుతోంది.

‘మా’లో నిధులు లేవని… హామీ ఇచ్చినట్టు వైద్యబీమా, పించన్ లను కళాకారులకు అందజేయడానికి స్టార్ హీరోలతో కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఫండ్స్ కలెక్ట్ చేయాలని జీవిత రాజశేఖర్ లు పట్టుబడుతున్నారు.

అయితే నిధుల సేకరణలో, వాటిని ఖర్చు చేయడంలో నరేష్ నిర్లక్ష్యం వహించడంతో వివాదం మొదలైంది. నరేష్ అసోసియేషన్ డబ్బును వాడుకున్నారని జీవితా రాజశేఖర్ ఆరోపించారు.

తాజాగా రాజశేఖర్ రాజీనామా చేయడంతో కార్యవర్గ సభ్యులు రెండుగా చీలిపోయారు. అధ్యక్షుడికి వ్యతిరేకంగా తాళాలు తీయడం లేదని తెలిసింది. వీరి వివాదం మా కార్యాలయం వరకూ చేరడంతో ఈ లొల్లి పతాక స్థాయికి చేరింది.