పవన్ కల్యాణ్ కు…. ఇలాంటి పరిస్థితా?

6జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఏ పార్టీ అధినేతకూ రాకూడని.. ఎదురు కాకూడని వింత పరిస్థితి ఎదురైంది. తన పార్టీ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ ను.. బతిమిలాడుకునే పరిస్థితి పవన్ కు వచ్చింది. శాసనసభలో మూడు రాజధానుల ప్రతిపాదనపై చర్చ జరిగితే.. వ్యతిరేకంగా ఓటు వేయండి.. అని లేఖ రాసి చెప్పేంత స్థాయిలో పవన్ ప్రయత్నించాల్సి వచ్చింది.

ఏం.. తన ఎమ్మెల్యేనే కదా… స్వయంగా ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా… తన పార్టీ నుంచే గెలిచాడు కదా… రాపాకను ఇలా వ్యవహరించండి.. అలా వ్యవహరించండి.. శాసనసభలో జనసేన గొంతుక వినిపించండి.. అని ఆదేశించవచ్చు కదా. ఇలా అన్ని అవకాశాలు ఉన్నా పవన్ కల్యాణ్ ఎందుకిలా చేశారు? బహిరంగ లేఖ రాసి మరీ రాపాకను పవన్ ఎందుకంతగా బతిమిలాడాల్సి వచ్చింది? అని తాజా పరిణామంపై జన సైనికులే కాదు.. జనాలూ మాట్లాడుకుంటున్నారట.

నిజానికి పవన్ కల్యాణ్ తో రాపాక వరప్రసాద్ కు ఏనాడో చెడింది. మూడు ప్రాంతాల అభివృద్ధి కాన్సెప్టుపై రాపాక ఎప్పుడో మద్దతుగా తన వాయిస్ వినిపించేశారు. అంతే కాదు.. ఈ ప్రతిపాదనపై ఓటింగ్ అంటూ జరిగితే మద్దతుగానే ఓటు వేస్తానని తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టేశారు.

అలా.. తెలుగుదేశంలో ఓ వల్లభనేని వంశీ మాదిరిగా.. జనసేనలో రాపాక వరప్రసాద్.. అధినేతకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. పవన్, రాపాక మధ్య నేరుగా మాట్లాడుకునేంత సంబంధాలు ఎప్పుడో కట్ అయ్యాయని చాలా మంది భావిస్తున్నారు. ఇక.. తాను వ్యక్తిగతంగా అమరావతికే మద్దతుగా నిలుస్తూ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు పవన్.

ఈ సందర్భంలో.. రాపాక శాసనసభలో మూడు రాజధానులకు సై అంటే.. మళ్లీ బహిరంగంగా పరువు పోతుందన్న బాధతోనే పవన్ ఇలా బహిరంగ లేఖ రాయాల్సి వచ్చిందని పలువురు అంచనా వేస్తున్నారు.

ఈ పరిస్థితిని చూసి.. పవన్ అభిమానులు బాధపడుతున్నారు. ఆయన ప్రత్యర్థులు మాత్రం.. చేసుకున్నోడికి చేసుకున్నంత.. అని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ నాయకుడిగా.. ఎమ్మెల్యేను అదుపులో పెట్టుకోకపోవడం.. పవన్ అసమర్థతకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు.

రాపాక వర ప్రసాదరావు గారికి..To, Sri Rapaka Varaprasad..- JanaSena Chief #PawanKalyan open letter.

Publiée par JanaSena Party sur Dimanche 19 janvier 2020