38 ఏళ్ల వయసులోనూ అదే జోరు

  • ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో ఫెదరర్, సెరెనా విజయాలు

ప్రపంచ టెన్నిస్ పురుషుల, మహిళల విభాగాలలో ఎవర్ గ్రీన్ స్టార్లు రోజర్ ఫెదరర్, సెరెనా విలియమ్స్..38 సంవత్సరాల లేటువయసులోనూ విజయాలు సాధిస్తూ వారేవ్వా అనిపించుకొంటున్నారు.

2020 టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో సీడెడ్ ప్లేయర్లుగా మరోసారి టైటిల్ వేటకు దిగిన ఈ ఇద్దరు దిగ్గజాలు తొలిరౌండ్ విజయాలు సాధించారు.

24వ టైటిల్ కోసం…

తన సుదీర్ఘకెరియర్ లో ఇప్పటికే 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ 38 సంవత్సరాల వయసులో 24వ టైటిల్ కు గురిపెట్టింది. మార్గారెట్ కోర్టు పేరుతో ఉన్న 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ రికార్డును సమం చేయాలన్న పట్టుదలతో బరిలోకి దిగింది.

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా ముగిసిన తొలిరౌండ్ పోటీలో 8వ సీడ్ సెరెనా…రష్యా ప్లేయర్ అనస్తాసియా పటపోవాను కేవలం 58 నిముషాలలోనే 6-0, 6-3తో చిత్తు చేసి రెండోరౌండ్లో అడుగుపెట్టింది. 2017లో తన చివరి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన సెరెనా ఆ తర్వాత నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీల ఫైనల్స్ చేరినా విజేతగా నిలువలేకపోయింది.

21వ టైటిల్ వేటలో ఫెదరర్…

గ్రాండ్ స్లామ్ సింగిల్స్ పురుషుల ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ 38 సంవత్సరాల వయసులోనూ తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఆరు ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ఫెదరర్..2020 టోర్నీ తొలిరౌండ్లో అమెరికా ప్లేయర్ స్టీవ్ జాన్సన్ ను 6-3, 6-2, 6-2తో చిత్తు చేసి…రెండోరౌండ్లో అడుగుపెట్టాడు.

జోకోవిచ్ 900వ గెలుపు..

ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ టైటిల్ వేటలో తొలిగెలుపు నమోదు చేశాడు. తొలిరౌండ్లో జర్మన్ ప్లేయర్ జాన్ లియనార్డో స్టుఫ్ ను నాలుగుసెట్ల పోరులో అధిగమించాడు. 7-6, 6-2, 2-6, 6-1తో అధిగమించాడు.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో గత 14 సంవత్సరాలుగా జోకోవిచ్ రెండోరౌండ్ చేరుతూ వచ్చాడు. అంతేకాదు…తన కెరియర్ లో 900వ విజయాన్ని సైతం నమోదు చేయగలిగాడు.

ఇప్పటికే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ ను ఏడుసార్లు నెగ్గిన రికార్డు జోకోవిచ్ పేరుతోనే ఉంది.