ఆ సినిమా టైటిల్ శేషాచలం కాదు

సుకుమార్ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇదంతా శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. దీంతో ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వీటిని దర్శకుడు సుకుమార్ ఖండించాడు. తమ సినిమాకు శేషాచలం అనే టైటిల్ పెట్టలేదని స్పష్టంచేశాడు. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడనే టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమాకు లారీడ్రైవర్ అనే పేరుపెట్టినట్టు కూడా వార్తలు వచ్చాయి. వీటిని కూడా యూనిట్ ఖండించింది.

మూవీ అప్ డేట్స్ గురించి చెబుతూ.. తమ సినిమాకు ఇప్పటివరకు ఎలాంటి టైటిల్ అనుకోలేదని స్పష్టంచేశాడు దర్శకుడు సుకుమార్. రంగస్థలం లాంటి డిఫరెంట్ టైటిల్ కోసం వెయిట్ చేస్తున్నామని, టైటిల్ పై చర్చ అప్పుడే ప్రారంభించలేదంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. వచ్చే నెల మొదటి వారం నుంచి సెకెండ్ షెడ్యూల్ మొదలవుతుంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె కూడా ఇంకా సెట్స్ పైకి రాలేదు. తన క్యారెక్టర్ కు సంబంధించి ప్రస్తుతం సుకుమార్ తో ఆమె చర్చల్లో ఉంది. అల్లు అర్జున్ టైపులోనే ఈమె కూడా ఈ సినిమాలో పక్కా మాస్ లుక్ లో పల్లెటూరి పిల్లలా కనిపించనుంది.