తెలంగాణలో చక్రం తిప్పిన వీళ్లంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు?

తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ ఏకీకరణ పేరుతో చాలా మందిని దగ్గరకు తీశారు. కాంగ్రెస్, టీడీపీల్లోని కీలక నేతలు, గతంలో మంత్రులుగా పని చేసిన వారిని టీఆర్ఎస్ లో చేర్చుకుని మంత్రి పదవులతో సత్కరించారు. వారి రాజకీయ పునర్జన్మకు కారణమయ్యారు. కానీ.. కాలం మారింది. ప్రాధాన్యాలు మారాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారు.. ప్రస్తుత ప్రభుత్వంలో అనామకులుగా మిగిలిపోయారు.

జూనియర్లు.. వారిపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ పెత్తనాన్ని వ్యతిరేకించలేక.. కేసీఆర్ ను తప్పుబట్టలేక.. సమస్యను కేసీఆర్ కూ, కేటీఆర్ కూ వివరించలేక.. సదరు పెద్ద మనుషులు, మాజీ మంత్రులు అయిన నేతలు సతమతం అవుతున్నారట.

అలాంటి వారిలో.. కడియం శ్రీహరి నుంచి మొదలు పెడితే.. తుమ్మల నాగేశ్వరరావు, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, జోగు రామన్న.. వీరితో పాటు మందా జగన్నాథం, స్వామి గౌడ్, మధుసూదనాచారి, ఏనుగు రవీందర్ రెడ్డి లాంటి వారు చాలా మంది ఈ లిస్ట్ లో ఉన్నారు.

ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి మంత్రి పదవిలో ఉన్నా.. ఈ జాబితాలోని మిగతా నేతలు మాత్రం ఏ దారీ తోచక.. బయటికి వెళ్లేంత ధైర్యం చాలక.. టీఆర్ఎస్ లోనే కుక్కిన పేనులా ఉంటున్న విషయం సామాన్యుడికీ స్పష్టంగా తెలిసిపోతుంది. ఇందులో.. తుమ్మల లాంటి నాయకులైతే.. ఇతర పార్టీనుంచి పోటీ చేసి గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చి.. తనపై ఆధిపత్యం చలాయిస్తున్న నేతల తీరు చూసి మరీ ఇబ్బంది పడాల్సివస్తోంది. అందుకే వీలు దొరికినప్పుడల్లా.. ఆయన బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం.

టీఆర్ఎస్ లో కేసీఆర్ తనకు తానుగా నాయకత్వ పరంగా కాస్త విశ్రాంతి తీసుకుంటున్న వేళ.. కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఇలా జరుగుతోందా.. లేదంటే ధిక్కార స్వరాలను తప్పించి.. కేటీఆర్ కు ఎదురు లేకుండా కేసీఆర్ ఆలోచనే ఇలా చేయిస్తోందా.. అన్నది మాత్రం సదరు నాయకులకు, వారి అనుచరులకు మింగుడుపడడం లేదు.