మండ‌లిలో ఇవాళ ఏం జ‌ర‌గ‌బోతోంది?

ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై అధికార విపక్షాల మధ్య నువ్వానేనా అన్నట్లు వార్ నడుస్తోంది. శాసనసభలో ఈజీగా నెగ్గిన బిల్లు… శాసనమండలిలో మాత్రం అంత ఈజీగా గట్టెక్కేలా కనిపించడంలేదు. రెండు బిల్లులను ఎలాగైనా అడ్డుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న టీడీపీ…తనకు అందుబాటులో ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగిస్తోంది. నిన్నరాత్రి ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య శాసన మండలిలో టీడీపీ ప్రవేశపెట్టిన రూల్‌ 71 తీర్మానం నెగ్గింది. మరి ఇవాళ మండలిలో ఏం జరగనుంది.

ఏపీ వికేంద్రీకరణ బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ….సెలెక్ట్‌ కమిటీ వ్యూహాన్ని రచిస్తోంది. మూడు రాజధానులు, సీఆర్డీయే బిల్లులపై చర్చ తర్వాత వీటిని సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటూ ఇప్పటికే మండలి చైర్మన్‌కు లేఖ ఇవ్వాలని భావిస్తోంది. అలాగే కొన్ని సవరణలు కూడా ప్రతిపాదించే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.

అమరావతి నుంచి కార్యాలయాలను తరలించకుండా బిల్లులకు సవరణలు ప్రతిపాదించే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సవరణలతో వచ్చిన బిల్లులను అసెంబ్లీ చర్చించి, తిరస్కరించి మళ్లీ మండలికి పంపాల్సి ఉంటుంది. రెండోసారి కూడా మండలి తిప్పి పంపితే ఇక దాని పాత్ర ముగిసినట్టే. శాసనసభ ఏం ఆమోదిస్తే అదే చట్టం అవుతుంది.

ఒకవేళ టీడీపీ కోరినట్లుగా ఈ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపితే…మరింత లోతుగా ఈ బిల్లులను పరిశీలించి కమిటీ తన నిర్ణయం తెలపాల్సి ఉంటుంది. ఈ పరిశీలనకు మూడు నెలల వరకూ సమయం ఉంటుంది. అప్పటివరకూ ఈ బిల్లుల ఆమోదం నిలిచిపోతుంది. ఈ బిల్లులను ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయలేదు. వెరసి…రాజధాని తరలింపుపై సర్కారు వేగానికి బ్రేకులుపడతాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. సెలెక్ట్‌ కమిటీకి పంపడంపై మండలిలో ఓటింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. టీడీపీకి మెజారిటీ ఉన్నందువల్ల ఆ పార్టీ ప్రతిపాదన నెగ్గడం ఖాయం.

మరోవైపు రూల్‌ 71 తీర్మానం ఆమోదం పొందడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుల పై చర్చ జరిగే అవకాశం ఉందా… లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మండలిలో జరిగే పరిణామాలను బట్టి… అసెంబ్లీలో ప్రభుత్వం వ్యూహరచన చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.