బీజేపీ, టీడీపీ… మళ్లీ ఒక్కటైపోయాయా?

ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే.. ఇది నిజమే అని నమ్మాల్సి వస్తోంది. బీజేపీకి టీడీపీ అతి దగ్గరగా అడుగులు వేస్తున్న విషయం.. రాజకీయంగా స్పష్టమైపోతోంది. రెండు పార్టీల చర్యలను గమనిస్తే.. ఓ రకంగా బీజేపీపైనే టీడీపీ ఆధారపడుతున్న తీరు.. జనానికి అర్థమవుతోంది. ఈ పరిణామానికి మూడు రాజధానుల ప్రతిపాదన.. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఓ దారి చూపినట్టుగా కనిపిస్తోంది.

2019 శాసనసభ ఎన్నికలకు ముందు.. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. ఒంటరిగా పోటీ చేసి.. చరిత్ర ఎరుగని భారీ ఓటమిని మూటగట్టుకుంది. వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. అధికారాన్ని హస్తగతం చేసుకుంది. నాటి నుంచి టీడీపీ పరిస్థితి.. రాజకీయంగా దిగజారిపోతోంది. ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోతుండగా.. కీలక నేతలు పార్టీని వీడే సంకేతాలు కనిపిస్తున్నాయి.

తాజాగా.. అమరావతి పేరిట తెలుగుదేశం చేస్తున్న ఉద్యమంలోనూ ఆ పార్టీ నేతలు అంత క్రియాశీలకంగా లేరన్న విషయాన్ని జనం గమనిస్తున్నారు. మరోవైపు.. కొన్నాళ్ల క్రితం టీడీపీకి చెందిన కీలక నేతలు, గతంలో చంద్రబాబుకు అనుంగులు అయిన సుజనా చౌదరి, సీఎం రమేశ్.. బీజేపీ గూటికి చేరారు. వారితో పాటు.. మరి కొందరు నేతలు కాషాయ కండువా వేసుకున్నారు. మోడీకి జై కొట్టారు.

నాటి నుంచి.. టీడీపీ తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బీజేపీపై విమర్శలు తగ్గించిన ఆ పార్టీ.. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ లక్ష్యంగానే రాజకీయాలు చేస్తోంది. తర్వాత.. జనసేన, బీజేపీ మధ్య రాజకీయ అవగాహన కూడా.. తెలుగుదేశం ప్రభావితమే అన్న మాటలు వినిపించాయి. అమరావతిపై చేస్తున్న పోరాటంలో.. టీడీపీని బీజేపీ కానీ.. బీజేపీని టీడీపీ కానీ.. అంతగా విమర్శించిన దాఖలాలైతే మచ్చుకు కూడా లేకుండా పోయాయి.

అభిప్రాయాలు కలుస్తున్నాయి. అవసరాలు కలిసొస్తున్నాయి. దక్షిణ భారతంలో బలపడడం బీజేపీకి ఎంత అవసరమో.. తర్వాత వచ్చే ఎన్నికల నాటికి బలాన్ని కూడదీసుకోవడం తెలుగుదేశం పార్టీకి అంతే అవసరం. మధ్యలో పవన్ చేరికతో ఓ సామాజిక ప్రయోజనమూ ఇరుపక్షాలకు సొంతం. అందుకే.. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన కట్టిన కూటమిలో.. త్వరలోనే తెలుగుదేశమూ చేరే అవకాశాలను కొట్టిపారేయలేము అన్నది రాజకీయ పరిశీలకుల వాదన.