సీఎం గారూ… మీ పథకాలు బాగున్నాయ్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను.. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యర్థి కలిశారు. జగన్ అమలు చేస్తున్న పథకాలపై.. విపక్షాలన్నీ దుమ్మెత్తి పోస్తున్న వేళ.. కైలాశ్ సత్యర్థి మాత్రం ప్రశంసల వర్షం కురిపించారు. పాఠశాల విద్యలో చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ విషయంలో మిగతా రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.

కైలాష్ సత్యర్థిని ఆకర్షించిన పథకాల్లో.. ప్రధానంగా అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్లను తగ్గించడమే ధ్యేయంగా అమలు చేస్తున్న ఈ పథకంతో పాటు.. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరుపై.. సత్యర్థి హర్షం వ్యక్తం చేసినట్టు తెలిపాయి.

ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, ఇతర పార్టీలకు.. ఈ పరిణామం కాస్త ఇబ్బందికరంగా మారినట్టు కనిపిస్తోంది. అందుకే.. టీడీపీ అనుకూల మీడియా కూడా.. ఈ దిశగా సానుకూల వార్తలు అంతగా రాయకపోవడం.. జగన్ ను కైలాష్ సత్యర్థి కీర్తిస్తూ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని గమనిస్తే.. తెలుగుదేశం నేతలు.. ఈ విషయాన్ని హైలైట్ చేయవద్దని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. కైలాష్ సత్యర్థి ఇచ్చిన స్ఫూర్తితో.. వైసీపీ నాయకులు మరింత ఉత్సాహంగా జనాల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని.. పథకాలపై మరింత ప్రచారం చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.