మళ్లీ రీమేక్ బాట పట్టిన వెంకీ

వెంకటేష్ కు రీమేక్స్ కొత్తకాదు. తెలుగు హీరోల్లో అత్యథిక రీమేక్స్ చేసిన హీరో ఇతడే. అయితే ఈమధ్య రీమేక్స్ కాస్త తగ్గించాడు. ఎఫ్2, వెంకీమామ అంటూ స్ట్రయిట్ సినిమాలు చేశాడు. ఇప్పుడు తిరిగి తన పాత ఫార్మాట్ లోకి వచ్చేశాడు వెంకీ. తమిళ్ లో హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు ఈ దగ్గుబాటి హీరో. ఇవాళ్టి నుంచి ఈ సినిమా మొదలైంది. ఈ సినిమాకు నారప్ప అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

అనంతపురంలో ఈరోజు నుంచి ఈ సినిమా మొదలైంది. ముహూర్తం షాట్ కు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల క్లాప్ కొట్టాడు. త్వరలోనే వెంకటేష్ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతాడు. సినిమా మొదలైన రోజునే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్స్ అంటూ మెటీరియల్ మొత్తం రిలీజ్ చేశారు. నారప్ప పాత్రలో వెంకటేష్ రఫ్ గా మాస్ గా కనిపిస్తున్నాడు. కాస్త ఓల్డ్ లుక్ లో కూడా ఉన్నాడు.

ఒరిజినల్ వెర్షన్ లో ఈ పాత్రను ధనుష్ పోషించాడు. తమిళ వెర్షన్ కు ఎలాంటి మార్పులు చేయకుండానే తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో వెంకీ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా కోసం దాదాపు వంద మంది నూతన నటీనటుల్ని ఎంపిక చేశారు. వాళ్లకు వర్క్ షాప్ కూడా నిర్వహించారు. సురేష్ బాబు, కళైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు నారప్ప సినిమాని.