కమెడియన్ సునీల్ కు తీవ్ర అస్వస్థత

కమెడియన్ గా ప్రస్థానం మొదలు పెట్టి రాజమౌళి చలువతో ‘మర్యాద రామన్న’తో హీరోగా వెలుగు వెలిగి అనంతరం అవకాశాలు లేక మరోసారి కమెడియన్ అవతారం ఎత్తిన సునీల్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఇటీవలే సునీల్ నటించిన ‘అల వైకుంఠపురం’ సినిమా రిలీజ్ అయ్యింది. 24న ‘డిస్కోరాజా’ కూడా విడుదలకు రెడీ అయ్యింది. కమెడియన్ గా ఫామ్ అందుకుంటున్న దశలో సునీల్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యాడు.

రవితేజ హీరోగా వస్తున్న ‘డిస్కోరాజా’లో సునీల్ కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమా ప్రమోషన్ లలో పాల్గొనడానికి రెడీ అవుతున్న వేళ సునీల్ తీవ్ర అస్వస్థతకు గురికావడం సినిమా యూనిట్ ను కంగారుపెడుతోంది.

సునీల్ నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో వెంటనే గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

గత వారం రోజులుగా సునీల్ ను జ్వరం వెంటాడుతుండడంతో ఆయన యాంటి బయాటిక్స్ ఎక్కువగా వాడినట్టు తెలిసింది. ఆ యాంటీ బయాటిక్స్ వల్ల గొంతు, ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ వచ్చినట్టు తెలిసింది. బుధవారం రాత్రి పరిస్థితి సీరియస్ కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే సునీల్ ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరుగుతోంది.

సునీల్ ఆస్పత్రి పాలవ్వడంతో రవితేజ డిస్కో రాజా ప్రమోషన్ లలో పాల్గొనలేకపోతున్నారు. ఈ మేరకు రవితేజకు సమాచారం అందించారు. ప్రస్తుతం సునీల్ మాట కూడా బయటకు పెగలడం లేదట.. తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి సీరియస్ అయినట్టు తెలిసింది. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పినట్టు తెలిసింది.