పవన్ సినిమాకు ద్వితీయ విఘ్నం

పింక్ తెలుగు రీమేక్ తో రీఎంట్రీ ఇచ్చాడు పవన్. మొదటి రోజు షూటింగ్ లో పవన్ హంగామా అంతా ఇంతా కాదు. అతడు సెట్స్ లో నడుస్తున్న స్టిల్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇదంతా ఒకరోజు ముచ్చటగానే మిగిలిపోయింది. రెండో రోజు నుంచి పవన్ షూటింగ్ కు డుమ్మా కొట్టేశాడు. అవును.. 2 రోజులుగా పవన్ రాజకీయాలతో బిజీ అయిపోయాడు. మళ్లీ సెట్స్ పైకి ఎప్పుడొస్తాడో తెలీదు.

మొదటి రోజు షూటింగ్ అయిపోయిన రాత్రి అమరావతి చేరుకున్నాడు పవన్. అదే రోజు కొంతమంది అమరావతి రైతులతో భేటీ అయ్యాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఢిల్లీ వెళ్లాడు. అలా పవన్ సినిమాకు ద్వితీయ విఘ్నం ఏర్పడింది. ఇది అక్కడితో ఆగలేదు. పవన్ ఢిల్లీలోనే ఉండిపోయాడు. నిన్న కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ ను కలిసిన పవన్, ఈరోజు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అవుతాడు.

ఈరోజు రాత్రికి పవన్ అమరావతి చేరుకుంటాడు. రేపు ఆయన పింక్ రీమేక్ షూటింగ్ కు వస్తారా లేదా అనేది ప్రస్తుతానికి అగమ్యగోచరం. మరోవైపు దిల్ రాజుకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. షూటింగ్ కోసం పవన్ విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ప్రత్యేక జెట్ ఏర్పాటుచేశాడు. ఇదొక ఖర్చు అనుకుంటే.. అన్నపూర్ణలో దాదాపు నెల రోజుల కిందటే ఈ సినిమా కోసం పెద్ద కోర్టు సెట్ వేశారు. ఆ అద్దెలు కూడా దిల్ రాజుకు భారంగా మారిపోయాయి. మరోవైపు పవన్ గైర్హాజరీతో మిగతా ఆర్టిస్టుల కాల్షీట్లు కూడా వృధా అవుతున్నాయి. ఇవన్నీ దిల్ రాజుకు ఆర్థిక భారాలే.