సరిలేరు నీకెవ్వరంటూ సైలెంట్ అయ్యారు

రిలీజైన మొదటి రోజు నుంచి తమ సినిమా ఇంత కలెక్ట్ చేసింది, తమ సినిమా అంత కలెక్ట్ చేసిందంటూ ఊదరగొట్టింది సరిలేరు నీకెవ్వరు యూనిట్. మరీముఖ్యంగా ప్రొడ్యూసర్ అనీల్ సుంకర రంగంలోకి దిగి మరీ వసూళ్ల పోస్టర్లు వరుసపెట్టి విడుదల చేశారు.

అలా 46 కోట్ల రూపాయల షేర్ నుంచి 200 కోట్ల రూపాయల గ్రాస్ వరకు పోస్టర్లు విడుదల చేస్తూనే ఉన్నారు. ఇలా ప్రతి రోజూ హంగామా చేసిన యూనిట్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.

అవును.. సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఇకపై యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు, పోస్టర్లు రావు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని అనీల్ సుంకర స్పష్టంచేశాడు.

ప్రస్తుతం పరిస్థితి చాలా సున్నితంగా మారిందని, అందుకే తమ సినిమాకు సంబంధించి ఇకపై వసూళ్ల వివరాలు బయటపెట్టమని ప్రకటించాడు సుంకర. ఫైనల్ రన్ పూర్తయిన తర్వాత టోటల్ కలెక్షన్ వివరాల్ని వెల్లడిస్తామన్నాడు.

అల వైకుంఠపురములో సినిమా నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది సరిలేరు నీకెవ్వరు సినిమా. అనీల్ సుంకర ఓ పోస్టర్ రిలీజ్ చేయడం ఆలస్యం, వెంటనే దానికి కౌంటర్ గా మరో పోస్టర్ రిలీజ్ చేస్తోంది బన్నీ టీం. దీంతో సరిలేరు నీకెవ్వరు యూనిట్ సైలెంట్ అయింది.

సో.. ఇప్పుడు బన్నీటీం నుంచి కూడా వసూళ్ల పోస్టర్ల వెల్లువ ఆగిపోయే అవకాశం ఉంది. ఇన్నాళ్లకు ఈ పోస్టర్ల యుద్ధం ఆగిందన్నమాట.