Telugu Global
NEWS

‘మండలి రద్దు’ పరిణామాలపై... ఆసక్తికర విషయాలు

పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో జరిగిన పరిణామాలపై.. జగన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడం… తర్వాత సభలో సుదీర్ఘ చర్చ జరగడం మనం చూశాం. ఈ నేపథ్యంలో… మండలి కథ కంచికే అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన మీడియా స్రవంతిలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కథ ఎక్కడివరకూ వెళ్తుందన్నది ఇప్పుడు అప్రస్తుతం. కానీ.. గతంలో మండలి రద్దు, తర్వాత పునరుద్ధరణ, మళ్లీ తాజా పరిణామాలు గమనిస్తుంటే.. మన మండలి గమనం ఏంటి.. ఎప్పుడు ఏర్పాటైంది.. అన్న విషయాలు చర్చలోకి […]

‘మండలి రద్దు’ పరిణామాలపై... ఆసక్తికర విషయాలు
X

పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో జరిగిన పరిణామాలపై.. జగన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడం… తర్వాత సభలో సుదీర్ఘ చర్చ జరగడం మనం చూశాం. ఈ నేపథ్యంలో… మండలి కథ కంచికే అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన మీడియా స్రవంతిలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కథ ఎక్కడివరకూ వెళ్తుందన్నది ఇప్పుడు అప్రస్తుతం. కానీ.. గతంలో మండలి రద్దు, తర్వాత పునరుద్ధరణ, మళ్లీ తాజా పరిణామాలు గమనిస్తుంటే.. మన మండలి గమనం ఏంటి.. ఎప్పుడు ఏర్పాటైంది.. అన్న విషయాలు చర్చలోకి వస్తున్నాయి.

అప్పుడెప్పుడో.. 1958లో రాష్ట్రంలో శాసనసమండలి ఏర్పాటైంది. తర్వాత.. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మండలిని రద్దు చేయాలని తీర్మానించారు. అప్పుడు మండలిలో అధికార తెదేపాకు తగినంత మెజారిటీ లేకపోవడమే దీనికి కారణం. కానీ… ఆ సమయంలో మండలి రద్దుకు తీర్మానం చేసి.. కేంద్రానికి పంపిస్తే.. నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. తర్వాత.. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం వచ్చాక.. మరోసారి ఎన్టీఆర్ ప్రభుత్వం తీర్మానం పంపగా.. ఆమోదం లభించింది. చివరికి శాసనమండలి రద్దయింది.

మళ్లీ.. 2007 లో వైఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. మండలిని పునరుద్ధరించారు. అప్పుడు సభలో 90 మంది ఎమ్మెల్సీలు ఉండేవారు. విభజన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ వాటాగా 58 మంది సభ్యులు ఉన్నారు. ఇన్నాళ్లకు మళ్లీ మండలి వివాదాస్పదంగా వార్తల్లోకి ఎక్కింది. మండలిలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్న వాదన ఒకరు చేస్తుంటే.. మరొకరు మాత్రం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో.. మండలి కొనసాగింపు ఎందుకన్న ఆలోచన చేస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ప్రభుత్వం తీసుకోబోయో చర్యలు ఏంటన్నదానిపై ఉత్కంఠ పెరుగుతోంది.

First Published:  24 Jan 2020 1:13 AM GMT
Next Story