సోమవారం నాటికి…. తేలనున్న మండలి భవితవ్యం

పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు శాసనసమండలిలో బ్రేకులు పడడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభుత్వంగా తాము రూపొందించిన బిల్లులపై సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వాల్సిన మండలి.. ఇలా అడ్డుకోవడం ఏంటని.. ఆగ్రహించింది. ఈ విషయమై.. నిన్న శాసనసభలో కాస్త సుదీర్ఘంగానే చర్చ జరిగింది.

ముఖ్యమంత్రి జగన్ సహా.. మంత్రులు బుగ్గన, ధర్మాన.. మరికొందరు తమ అభిప్రాయాలను విస్పష్టం చేశారు. ఏటా శాసనమండలికి 60 కోట్లు ఖర్చు పెడుతున్నామని.. నిర్వహణ, జీత భత్యాల కోసం ఈ ఖర్చు తప్పడం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. శాసనసభలో చెప్పారు.

మరోవైపు ముఖ్యమంత్రి జగన్ కూడా.. మండలిలో తెదేపా సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఛైర్మన్ కు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపే విచక్షణ అధికారం లేదని అన్నారు. ఈ విషయంలో సోమవారం తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఈ పరిణామాలపై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. మండలి రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్పటివరకైతే.. ఈ దిశగా జగన్ ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించలేదు. సోమవారం నాటికి ఈ దిశగా స్పష్టత వచ్చే అవకాశమైతే ఉంది.