గాయంతో సానియా అవుట్

  • చేదుఅనుభవంగా ముగిసిన గ్రాండ్ స్లామ్ రీ-ఎంట్రీ
  • ఒక సెట్ ముచ్చటగా ముగిసిన ఆస్ట్ర్రేలియన్ ఓపెన్

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ రీ-ఎంట్రీ.. భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జాకు చేదుఅనుభవంగా మిగిలింది. మాతృత్వం కోసం రెండేళ్లక్రితం టెన్నిస్ కు దూరమై..ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కఠోర సాధనతో 27 మాసాల విరామం తర్వాత కఠోరసాధనతో టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన 33 ఏళ్ల సానియాకు ..రెండో ఇన్నింగ్స్ అంతతేలికకాదని తెలిసిపోయింది.

ఉక్రెయిన్ ప్లేయర్ నాడియాతో జంటగా హోబర్ట్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన సానియా…ప్రస్తుత సీజన్ తొలిగ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్, మహిళల డబుల్స్ లో పాల్గొనటానికి అర్హత సంపాదించింది.

రోహన్ బొపన్నతో జంటగా మిక్సిడ్ డబుల్స్ బరిలోకి దిగాల్సిన సానియా గాయం అనుమానంతో ఉపసంహరించుకొంది. అయితే ..మహిళల డబుల్స్ లో మాత్రం.. తొలిరౌండ్లో చైనా జోడీ జిన్- లిన్ తో తలపడి తొలిసెట్ ను 2-6తో చేజార్చుకొని… రెండోసెట్ కు సిద్ధమైన సమయంలో కాలిగాయంతో రిటైర్మెంట్ తీసుకొంది. భరించలేని నొప్పితో ఆట నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది.

మొత్తం మీద… సానియా మీర్జా గ్రాండ్ స్లామ్ రీ-ఎంట్రీ ఓ సెట్టు ముచ్చటగా, చేదుఅనుభవంగా మిగిలిపోయింది. ఓ బిడ్డకు స్త్రీమూర్తులు జన్మనివ్వడమే పునర్జన్మతో సమానం మాత్రమే కాదు… ప్రొఫెషనల్ టెన్నిస్ లో సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేసి రాణించడమూ అంతతేలికకాదని… సానియా అనుభవం చూస్తేనే తెలిసిపోతుంది.