అక్లాండ్ లో భారత్- న్యూజిలాండ్ తొలి టీ-20 సమరం

  • కాసేపట్లో ఈడెన్ పార్క్ వేదికగా పోటీ

కొత్తసంవత్సరంలో భారత్ విదేశీగడ్డపై తొలి టీ-20 సిరీస్ సమరానికి సిద్ధమయ్యింది. ఐదుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో అక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా తొలి టీ-20లో ఢీ కొనబోతోంది.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని 15 మంది సభ్యుల భారతజట్టు కొద్దిరోజుల క్రితమే అక్లాండ్ చేరుకోడం ద్వారా సిరీస్ కు సిద్ధమయ్యింది. ఆస్ట్ర్రేలియా వేదికగా మరికొద్ది మాసాలలో జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా న్యూజిలాండ్ తో ఐదుమ్యాచ్ ల సిరీస్ లో విరాట్ సేన ఢీ కొంటోంది.

టీ-20 తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 2, న్యూజిలాండ్ 6 ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి.

కివీస్ కు గాయాల దెబ్బ…

కేన్ విలియమ్స్ సన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు పలువురు యువ ఆటగాళ్లతో పోటీకి దిగుతోంది. ట్రెంట్ బౌల్ట్, టిమ్ లాథమ్ లాంటి పలువురు సీనియర్ ప్లేయర్లు గాయాలతో అందుబాటులో లేకపోడంతో నవతరం ఆటగాళ్లతో కివీ జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది.

మరోవైపు… కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులో రోహిత్ శర్మ, రాహుల్, శ్రేయస్ అయ్యర్,మనీష్ పాండే, శివం దూబే, షమీ, నవదీప్ సైనీ, జస్ ప్రీత్ బుమ్రా లాంటి మెరుపు ఆటగాళ్లున్నారు.

రవీంద్ర జడేజా, యజువేంద్ర చహాల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లాంటి స్పిన్నర్లు భారత తురుపుముక్కలుగా ఉన్నారు.
బ్యాటింగ్ కు అత్యంత అనువుగా ఉండే ఈడెన్ పార్క్ వికెట్ వేదికగా జరిగే ఈ పోటీ హైస్కోరింగ్ తో సాగే అవకాశం ఉంది.

సీమ్ కమ్ స్వింగ్ బౌలింగ్ కు అనువుగా ఉన్న అక్లాండ్ వాతావరణంలో సీమ్ బౌలర్లు ప్రధానపాత్ర వహించబోతున్నారు. రెండోర్యాంకర్ భారతజట్టు హాటే ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది.