రామోజీరావు కోర్టుకు రావాల్సిందే… మార్గదర్శి కేసులో మళ్లీ కీలక పరిణామం !

ఈనాడు రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో మళ్లీ కదలిక వచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణం పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్. షా ధర్మాసనం విచారించింది.

మార్గదర్శి చిట్ ఫండ్  చైర్మన్ రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్‌ చేయడాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సవాల్ చేస్తూ పిటీషన్‌ వేశారు. దీంతో ఈ పిటీషన్‌ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ సర్కార్‌ను ప్రతివాదిగా చేర్చింది. రిజర్వు బ్యాంకు ప్రత్యేక అధికారి ని కూడా ఇందులో ప్రతివాదిగా చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సవరించిన మెమోను దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ రెండు వారాలకు  వాయిదా పడింది.

2018 డిసెంబర్‌ 31న హైకోర్టు విభజన సమయంలో ఈ కేసు నుంచి ఏపీ సర్కార్‌ను తప్పించారు. కేవలం తెలంగాణ సర్కార్‌ను మాత్రమే ప్రతివాదిగా ఉంచారు. దీంతో ఈ విషయం తెలిసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఇప్పుడు ఆ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈ కేసులో కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే ప్రతివాదిగా చేర్చారని…. ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ను కూడా పార్టీ చేయాలన్న తమ పిటీషన్‌కు సుప్రీంకోర్టు ఒకే చెప్పిందని ఉండవల్లి అన్నారు.

అవిభక్త హిందూ కుటుంబ సంస్థ (హెచ్‌యూఎఫ్‌) అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం–1934లోని సెక్షన్‌ 45(ఎస్‌) నిబంధనను ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేశారు. హిందూ అవిభాజ్య కుటుంబానికి డిపాజిట్లు సేకరించ వచ్చనే వాదనను రామోజీరావు తీసుకొచ్చారని… కానీ ఆ వాదన కరెక్ట్‌ కాదని అంటున్నారు ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌.

రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చామన్న క్లైమ్‌లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా లేదా అనే పరిశీలనను కూడా అడ్డుకుంటున్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చామని చెప్పినంత మాత్రాన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవు. ఈ కేసుపై ట్రయల్ కోర్టులో నిబంధనల ప్రకారం విచారణ జరగాలి అన్నారు ఉండవల్లి.

డిపాజిట్లు తిరిగి ఇచ్చినా చట్టం నుంచి రామోజీరావు తప్పించుకోలేరని అన్నారు ఉండవల్లి. సేకరించిన డిపాజిట్లకు రెండు రెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రామోజీరావుకు దాదాపు ఏడు వేల కోట్లు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష పడుతుందని అన్నారు.  డిపాజిట్ల సేకరణలో తేడా ఉన్నా… రామోజీరావు కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్నారని…. కానీ ఇప్పుడు తప్పకుండా రావాల్సి ఉంటుందని ఉండవల్లి చెప్పారు.