రూమర్లు ఖండించిన భాగ్యశ్రీ

నిన్నట్నుంచి నటి భాగ్యశ్రీపై ఒకటే పుకారు. ఆమె ప్రభాస్ కు తల్లిగా నటిస్తోందట. ఈ పుకారు వచ్చినప్పట్నుంచి ఆమెకు ఒకటే ఫోన్ కాల్స్. అప్పుడే తల్లి పాత్రలకు ఎందుకు వచ్చేశావంటూ ఓదార్పులు, పరామర్శలు. ఇలా ఎన్నో ఫేస్ చేసిన భాగ్యశ్రీ, ఫైనల్ గా తనపై వచ్చిన పుకార్లకు సమాధానం ఇచ్చింది. ప్రభాస్ సినిమాలో తను తల్లిగా నటించడం లేదని స్పష్టంచేసింది. అయితే ఇక్కడ ఓ చిన్న మెలిక కూడా పెట్టింది.

ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు (తల్లి పాత్ర అని టాక్) భాగ్యశ్రీని తీసుకున్నారు. ఆమె ఆల్రెడీ సెట్స్ పైకి కూడా వచ్చేసింది. తను షూటింగ్ లో ఉన్నాననే విషయాన్ని కూడా భాగ్యశ్రీ ప్రకటించింది. అయితే తనది తల్లి పాత్ర కాదంటోందీమె. అలాmఅని పూర్తిగా ఖండించడం లేదు. తనది తల్లి లాంటి పాత్ర అంటోంది.

సినిమాలో తన క్యారెక్టర్ చాలా షాకింగ్ గా ఉంటుందని, తన పాత్ర చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ ఫీలవుతారని మాత్రం చెబుతోంది. మరోవైపు సినిమాలో సెట్స్ గురించి మాట్లాడుతూ.. భూమిపైకి స్వర్గం వచ్చినట్టుందని, సిల్వర్ స్క్రీన్ పై ఈ సెట్స్ చూసి ప్రేక్షకులు మైమరిచిపోతారని చెబుతోంది.

మొత్తానికి ప్రేమపావురాలు సినిమాతో దశాబ్దాల కిందట తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఈమె ఎట్టకేలకు ఇలా ప్రభాస్ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ను పలకరించబోతోంది.