బీజేపీ.. జనసేన లాంగ్ మార్చ్ లేనట్టే!

ఆంధ్రప్రదేశ్ లో కలిసి రాజకీయాలు చేయాలని అంగీకారానికి వచ్చిన బీజేపీ, జనసేన పార్టీలు.. ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేశాయి.

మూడు రాజధానులంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా… రాజధాని రైతులకు మద్దతుగా… ఫిబ్రవరి 2న ఇరు పార్టీలు కలిసి కవాతు చేయాలని నిర్ణయించాయి.

ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటన సందర్భంగా… జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. ఇంతలోనే.. ఈ రెండు పార్టీలు మనసు మార్చుకున్నట్టున్నాయి. కవాతు అంటూ ఏదీ చేయడం లేదని.. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు నాగభూషణం ప్రకటించారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. పవన్ కల్యాణ్ మాత్రం ఈ విషయంపై నేరుగా ఇప్పటివరకూ స్పందించలేదు.

రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పని చేయాలని నిర్ణయానికి వచ్చిన ఈ రెండు పార్టీలు తలపెట్టిన మొదటి కార్యక్రమం.. ఇలా హఠాత్తుగా నిలిచిపోయింది. ఇప్పటివరకైతే.. తమ ఉమ్మడి కార్యాచరణను పార్టీలు ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటిస్తామని కన్నా, పవన్ లాంటి నేతలు పదే పదే చెబుతున్నారు.

ఎప్పుడు వారు ఆ కార్యాచరణ ప్రకటిస్తారా.. అని ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.