ఆర్ఆర్ఆర్ నుంచి మరో వీడియో లీక్

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇప్పటికే ఓ వీడియో లీక్ అయింది. అరకు షెడ్యూల్ లో ఎన్టీఆర్ తలపాగా పెట్టుకొని నటిస్తున్న ఓ సీన్ ను ఎవరో షూట్ చేసి లీక్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆర్ఆర్ఆర్ నుంచి మరో వీడియో లీక్ అయింది. ఈసారి కూడా ఎన్టీఆర్ నటించిన సన్నివేశమే కావడం ఆశ్చర్యం.

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కు ఓ పులి ఫైట్ పెట్టాడు దర్శకుడు రాజమౌళి. ఈ సీక్వెన్స్ ను జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాడు. సినిమా మెయిన్ ఎట్రాక్షన్స్ లో ఇది కూడా ఒకటి. అలాంటి సన్నివేశం కాస్తా ఇప్పుడు లీక్ అయింది. గ్రాఫిక్స్ డిపార్ట్ మెంట్ నుంచి ఆ 30 సెకెన్ల సీన్ లీక్ అయిందనే విషయం స్పష్టంగా అర్థమౌతూనే ఉంది.

ఊహించని విధంగా కీలకమైన సన్నివేశం లీక్ అవ్వడంతో రాజమౌళి యూనిట్ ఎలర్ట్ అయింది. వెంటనే ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఉన్న లీక్ వీడియోస్ ని డిలీట్ చేసింది. అయితే అప్పటికే ఆ వీడియో వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా చేరిపోయింది. ట్విట్టర్, ఫేస్ బుక్ అంటే ఓకే. వాట్సాప్ గ్రూపుల్లో చేరిపోయిన వీడియోను డిలీట్ చేయడం ఎవరి వల్ల కాదు.