మరో బిడ్డకు జన్మనిచ్చిన స్నేహ

హోమ్లీ హీరోయిన్ స్నేహ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నిన్న మధ్యాహ్నం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో స్నేహకు ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని ఆమె భర్త ప్రసన్న అధికారికంగా వెల్లడించాడు. తల్లి-బిడ్డ క్షేమంగా ఉన్నట్టు ప్రకటించాడు.

పెళ్లయినా సినిమాలు కంటిన్యూ చేస్తోంది స్నేహ. ప్రసన్నను వివాహం చేసుకున్న తర్వాత కూడా పలు తమిళ, తెలుగు, కన్నడ సినిమాలు చేసింది. అదే టైమ్ లో ఆమె గర్భవతి అయింది. ఓ కొడుక్కి జన్మనిచ్చింది. కొడుకు పుట్టిన తర్వాత ఆమె సినిమాలు ఆపేస్తుందని అంతా భావించారు. కానీ స్నేహ మాత్రం సినిమాలు కొనసాగించింది.

ఓవైపు సినిమాలు కొనసాగిస్తూనే, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె మరోసారి గర్భవతి అయింది. ఈసారి స్నేహ-ప్రసన్న దంపతులకు ఆడపిల్ల పుట్టింది. డెలివరీకి 5 నెలల ముందే తన సినిమాలన్నీ పూర్తిచేసింది స్నేహ. ఇప్పుడు డెలివరీ తర్వాత మరో 5 నెలలు గ్యాప్ తీసుకోబోతోంది. పాప కాస్త పెద్దదైన తర్వాత తిరిగి ఆమె సినిమాల్లో నటిస్తుంది.