తెలంగాణలో మళ్లీ.. సారు కారు.. సర్కారుదే హవా

తెలంగాణలో మరోసారి అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి హవా కనిపించింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా బీజేపీ తదితర పార్టీల పాత్ర నామమాత్రమైంది. వందకు పైగా మున్సిపాలిటీల్లోనే కాక.. సింహ భాగం కార్పొరేషన్ లనూ టీఆర్ఎస్ కే అందించారు తెలంగాణ ప్రజలు. ఇతర పార్టీలను అందనంత దూరంలో నిలిపారు.

ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే.. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమ విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. వారి ఆలోచనలకు తగ్గట్టే.. ఫలితాలు రావడం తెలంగాణ భవన్ లో ఉత్సాహం నింపింది. కార్యకర్తల డప్పు దరువులు, నృత్యాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.

సాయంత్రం 5 గంటల లోపు.. దాదాపుగా మున్సిపాలిటీల్లో ఫలితాలు వెలువడగా.. మొత్తం 120 స్థానాలకు గాను 107 స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుంది. చెరో రెండు స్థానాల్లో బీజేపీ, ఎంఐఎం విజయం సాధించగా.. కాంగ్రెస్ మాత్రం 7 స్థానాలకే పరిమితమై.. టీఆర్ఎస్ కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

ఫలితాల చివరి దశకు.. మరో ఒకటి రెండు స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకున్నా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్ల ఆధారంగా అధికార పార్టీకి ఇంకా అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కలు ఎలా ఉన్నా.. టీఆర్ఎస్ పార్టీ మరోసారి తెలంగాణలో తన పట్టును తాజా మున్సిపల్ ఫలితాలతో నిరూపించుకుంది.