మరో మల్టీప్లెక్స్ పై కన్నేసిన మహేష్

కేవలం సినిమాల్నే నమ్ముకోలేదు మహేష్. సినిమాల నుంచి వచ్చే ఆదాయంతో ఎలా వ్యాపారవేత్తగా మారాలనే అంశంపైనే ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. అందుకే అతడి నుంచి సినిమాల కంటే ఎక్కువగా యాడ్స్ వస్తుంటాయి. ఇప్పటికే 10కి పైగా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేశ్.. అదే సమయంలో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా ఎంటరయ్యాడు.

వ్యాపారం కొత్త కాబట్టి ఏషియన్ వాళ్లతో కలిసి ఏఎంబీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మహేష్ కు అంతోఇంతో అనుభవం వచ్చింది. మల్టీప్లెక్స్ బిజినెస్ లో లాభాలు ఏ రేంజ్ లో వస్తాయో తెలుసుకున్నాడు. మరీ ముఖ్యంగా ఇలాంటివి మెయింటైన్ చేయడం ఎలాగో కూడా నేర్చుకున్నాడు. దీంతో ఇప్పుడు ఏఎంబీ మాల్ ను తలదన్నేలా మరో పెద్ద మల్టీప్లెక్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నాడట మహేష్.

ఈసారి ఎలాంటి భాగస్వామ్యాలు లేవు. పూర్తిగా తన సొంత డబ్బులతో ఓ భారీ మల్టీప్లెక్స్ నిర్మించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం నమ్రత ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈసారి మహేష్ బెంగళూరుపై కన్నేశాడు. కొత్త మల్టీప్లెక్సును హైదరాబాద్ లో కాకుండా బెంగళూరులో కట్టాలనేది మహేష్ ప్లాన్. సొంతంగా మల్టీప్లెక్స్ కట్టే స్తాయికి వచ్చాడంటే, మహేష్ సంపాదన ఏ రేంజ్ లో ఉందో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు.