ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా మాధ‌వ్ !

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు మారారు. కొత్త‌గా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇక రాష్ట్రాల్లో కూడా అధ్య‌క్ష మార్పు ఉంటుంద‌ని ప్రచారం మొద‌లైంది. ఏపీ బీజేపీకి కొత్త అధ్య‌క్షుడు వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుత అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఎన్నిక‌ల ముందు పార్టీలో చేరారు. అప్ప‌టి రాజకీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న్ని అధ్య‌క్ష ప‌ద‌వి వ‌రించింది. అయితే కాపు ఈక్వేష‌న్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో బీజేపీ ఇప్పుడు మరో ఆలోచన చేస్తోంద‌ట‌.

గ‌త ఎన్నిక‌ల్లో అంద‌రూ కాపు ఓట్ల‌పై దృష్టిపెట్టారు. జ‌న‌సేన ప‌వ‌న్‌క‌ల్యాణ్ కు కూడా కాపు ఓట్లు ప‌డ్డాయి. దీంతో ఈ ఈక్వేష‌న్ ప‌నిచేయ‌లేద‌ని ఇప్పుడు బీజేపీ కొత్త ఆలోచ‌న చేస్తోంద‌ట‌. జ‌న‌సేన‌తో బీజేపీకి ఇప్పుడు అవ‌గాహ‌న న‌డుస్తోంది. పొత్తు రాజ‌కీయాల‌తో ముందుకు పోవాల‌ని అనుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కాపు వ‌ర్గానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష ప‌ద‌వి ఇవ్వ‌డం వ‌ల్ల పార్టీకి వ‌చ్చే లాభం లేద‌నేది క‌మ‌లం నాథుల అంచ‌నా. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ల్ల కాపు ఓట్లు వ‌స్తాయి. దీంతో బీసీ వ‌ర్గానికి చెందిన వారిని ఆకట్టుకోవాల‌నేది బీజేపీ ప్లాన్‌. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుని అధికారంలోకి రావాల‌నేది ఆ పార్టీ ఎత్తుగ‌డ‌. ఇంత‌కుముందు ప‌లు రాష్ట్రాల్లో ఇదే ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది.

బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్‌ను అధ్య‌క్షుడిగా నియ‌మిస్తార‌నేది లేటెస్ట్ టాక్‌. కొప్పుల వెల‌మ‌కు చెందిన ఈయ‌న బీజేపీలో కీల‌క నేత గా ఎదిగారు. ఆర్ఎస్ఎస్ కుటుంబ నేప‌థ్యం. దీంతో ఈయ‌న్ని ఇప్పుడు అధ్య‌క్షుడిగా నియ‌మిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి ఏపీ బీజేపీకి త్వ‌ర‌లోనే అధ్య‌క్షుడు రావ‌డం మాత్రం ఖాయం అని అంటున్నారు.