రవితేజ టైటిల్ తో గోపీచంద్ సినిమా

రవితేజతో ఓ సినిమా చేయబోతున్నానని, దానికి సీటీమార్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్టు గద్దలకొండ గణేష్ సినిమా టైమ్ లోనే ప్రకటించాడు దర్శకుడు హరీష్ శంకర్. కట్ చేస్తే, ఇప్పుడు అదే టైటిల్ తో గోపీచంద్ తన కొత్త సినిమా ప్రకటించాడు. అవును.. ఈరోజు గోపీచంద్ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగో డిజైన్స్ రిలీజ్ అయ్యాయి.

సంపత్ నంది దర్శకత్వంలో మరోసారి నటిస్తున్న గోపీచంద్, ఈసారి సీటీమార్ సినిమాలో సరికొత్త కోణంలో కనిపించబోతున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో యూటర్న్ లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

హైదరాబాద్, రాజమండ్రిలో ఈ సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్స్ పూర్తిచేశారు. ఈరోజు నుంచి రామోజీ ఫిలింసిటీలో మరో పెద్ద షెడ్యూల్ మొదలైంది. గ్యాప్స్ లేకుండా షూటింగ్ పూర్తిచేసి, ఈ సమ్మర్ లోనే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ మూడో వారంలో సీటీమార్ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.