కర్మకాండ పూర్తయింది… చనిపోయాడనుకున్న వ్యక్తి కనిపించాడు

ఒకాయన తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన వ్యక్తి చనిపోయాడని.. ఆయన శవం దొరికిందని.. కుటుంబసభ్యులకు అప్పగించారు. కట్టలు తెంచుకున్న దుఖాన్ని దిగమింగి.. ఆ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఆ తర్వాతే అసలు కథ అందరినీ షాక్ కు గురిచేసింది. అంత్యక్రియలు పూర్తి చేసిన కాసేపటికే.. ఆ చనిపోయిన వ్యక్తి ఇంటికి చేరాడు. నేను బతికే ఉన్నానంటూ.. కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చాడు.

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం.. పొట్లపాడు గ్రామంలో జరిగింది ఈ ఘటన.. కుటుంబీకులు, గ్రామస్తులనే కాదు.. పోలీసులనూ నివ్వెరపరిచింది. అసలు విషయం ఏంటంటే.. పోలెబోయిన వెంకటరావు అనే 45 ఏళ్ల వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పొట్లపాడుకు చెందిన ఆయన.. కనుమ రోజున ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత 22న.. కురిచేడు సమీపంలో ఓ శవాన్ని గుర్తించిన పోలీసులు, స్థానికులు.. అది వెంకటరావుదే అని నిర్ధారించారు. కుటుంబీకులకు శవాన్ని అప్పగించారు. తర్వాత అంత్యక్రియలూ జరిగిపోయాయి.

ఆ తర్వాత.. ఓ అజ్ఞాత వ్యక్తి.. వెంకటరావు భార్య అంజనాదేవికి ఫోన్ చేశాడు. తర్లుబాడు మండలం రాయవరం తిరునాళ్లలో తిరుగుతున్నాడని చెప్పి.. అందుకు సంబంధించిన దృశ్యాలనూ పంపించాడు. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి తిరునాళ్లకు వెళ్లిన అంజనాదేవి.. తన భర్తను ఇంటికి తీసుకువచ్చింది. చనిపోయాడనుకున్న వ్యక్తి తరిగి వచ్చేసరికి.. ఆ కుటుంబమంతా ఆనందించింది.
ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే.. వెంకటరావు అనుకుని.. అతని కుటుంబసభ్యులు అంత్యక్రియలు జరిపించిన సదరు శవం ఎవరిది? పోలీసులే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలిక.