అంకెలు చూసి ఆశ్చర్యపోయా….

తన సినిమాకు వస్తున్న వసూళ్లు చూసి తనే ఆశ్చర్యపోయానని అంటున్నాడు అల్లు అర్జున్. అల వైకుంఠపురములో సినిమాకు వస్తున్న కలెక్షన్లను ఇప్పటీ నమ్మలేకపోతున్నానని చెబుతున్నాడు. నిన్న సాయంత్రం ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు. నాన్-బాహుబలి-2 రికార్డు తమదే అంటూ అధికారికంగా ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా వసూళ్లపై స్పందించాడు బన్నీ.

అతడి రియాక్షన్ అతడి మాటల్లోనే…

“అమెరికా నుంచి అనకాపల్లి సెంటర్ వరకు మా సినిమా దూసుకుపోతోందని అంతా అంటుంటే నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. నేను కూడా ప్రతి రోజూ డీసీఆర్ షీట్ చూసి ఆశ్చర్యపోతున్నాను. నాకు కూడా ఓ అంచనా ఉండేది. ప్రతి రోజు ఇక ఈ సినిమా ఆగుతుందేమో అనుకుంటున్నాను. కానీ ఈ సినిమా ఆగట్లేదు. నిజంగానే నాకు ఆశ్చర్యంగా ఉంది.”

“కలెక్షన్లను… రికార్డులు కొట్టడం కోసం చూడకూడదు. అత్మవిశ్వాసం పెంచడం కోసం చూడాలి. వసూళ్లు పెరిగితే తెలుగు ఇండస్ట్రీ హద్దులు పెరుగుతాయి. మరిన్ని ప్రయోగాలు చేయొచ్చు. ఇంకాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టి, మరో లార్జర్ దేన్ లైఫ్ సినిమా తీయొచ్చు. వసూళ్లను నేను ఈ కోణంలోనే చూస్తాను. రికార్డులు ఎప్పటికైనా మారిపోతాయి. 6 నెలల తర్వాత నా రికార్డు పోవచ్చు. కానీ ఓ మంచి సినిమా తీశామని ప్రేక్షకులు గుర్తించారు. అది చాలు.” అంటూ మాట్లాడాడు బన్నీ.