బండ్ల గణేష్ మళ్లీ రాజకీయాల బాట… పవన్ ఫొటో ట్వీట్

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ లైన్లోకి వచ్చాడు. మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ కు ఆ సినిమాలో అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కకపోవడంతో సినీ అవకాశాలు రావడం లేదు. దీంతో బండ్ల గణేష్ మళ్లీ రాజకీయాల్లోకి రావడానికి ఉబలాటపడుతున్నట్టు సంకేతాలిచ్చాడు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు బండ్ల గణేష్.. సీటు దక్కకపోవడంతో నిరాశకు గురి అయ్యాడు. తరువాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా… కేసీఆర్ పాలనపై సంచలన కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే 7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానన్న ఆయన మాటలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి.

అయితే రాజకీయాల్లో దెబ్బతిన్న బండ్ల గణేష్ తత్త్వం బోధపడి రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదని ప్రకటించాడు. కాంగ్రెస్ కు తనకు సంబంధం లేదన్నాడు.

తాజాగా బండ్లగణేష్ కు సడన్ గా పవన్ పై ప్రేమ చిగురించింది. పవన్ ఫొటోను షేర్ చేసి ట్వీట్ చేశారు. ‘నేను భయంతో రాలేదు.. బాధ్యతతో వచ్చాను’ అనే పవన్ ఫొటోను షేర్ చేసి ‘ఇది నిజం’ అంటూ కామెంట్ చేశాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేశాడు. దీంతో మళ్లీ రాజకీయాల బాట పెట్టాడా? అన్న చర్చ సాగుతోంది.

కాంగ్రెస్ లో చేరాక పవన్ కు పూర్తిగా దూరమైన బండ్ల… ఇప్పుడు మళ్లీ పవన్ నామస్మరణ చేశారు. అప్పట్లో తన దేవుడు పవన్ అన్న బండ్లకు మళ్లీ ఇన్నాళ్లకు పవన్ గుర్తుకురావడం హాట్ టాపిక్ గా మారింది.