క‌రీంన‌గ‌ర్‌లో కాంగ్రెస్‌కు ఏమైంది ?

పొన్నం ప్ర‌భాక‌ర్‌- పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌
శ్రీధ‌ర్‌బాబు- పీసీసీ చీఫ్ కావాల‌ని క‌ల‌లు కంటున్న నేత‌
జీవ‌న్‌రెడ్డి- చాన్స్ వ‌స్తే కాబోయే పీసీసీ చీఫ్

ముగ్గురూ ముగ్గురే. జాతీయ స్థాయి కాంగ్రెస్‌లో ప‌ట్టున్న నేత‌లు. కానీ గ‌ల్లీలో మాత్రం జీరో. క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క‌నీసం ఖాతా తెర‌వ‌లేదు. 60 డివిజ‌న్లు ఉంటే…ఒక్క డివిజ‌న్‌లో కూడా కాంగ్రెస్ గెల‌వ‌లేదు. ఎందుకు? ఈ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది? అస‌లు కార‌ణాలేంటి? అనే దానిపై తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల టైమ్‌లో కరీంన‌గ‌ర్ నుంచి పొన్నం ప్ర‌భాక‌ర్ పోటీ చేశారు. మూడో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. ఎంపీ అభ్య‌ర్థి ల‌క్ష్మీన‌ర‌సింహ‌రావుకు ఆ స్థానం ఇస్తే ఆయ‌న మంచి పోటీ ఇచ్చేవార‌ట‌. కానీ పొన్నంకు టికెట్ ఇచ్చారు. రెండోసారి ఎంపీగా ఓడిన త‌ర్వాత పొన్నం కేడ‌ర్ దెబ్బ‌తింది. ప‌లువురు నేత‌లు టీఆర్ఎస్‌లో చేరారు.

క‌రీంన‌గ‌ర్‌లో పొన్నం ప‌ట్టు త‌ప్పింది. దీంతో ఆయ‌న అనుచ‌రులు మొత్తం టీఆర్ఎస్ లేదా బీజేపీలో చేరారు. ప్ర‌స్తుతం బీజేపీ త‌ర‌పున గెలిచిన కార్పొరేట‌ర్లు కొంద‌రు కాంగ్రెస్‌కు చెందిన వారే. 36 వ వార్డు నుంచి గెలిచిన జ‌య‌శ్రీ కాంగ్రెస్ నుంచి ఇంత‌కుముందు కౌన్సిల‌ర్‌గా గెలిచారు. ఇప్పుడు బీజేపీ త‌ర‌పున కార్పొరేట‌ర్ అయ్యారు. ఈమె పొన్నం బ్యాచ్‌. కాంగ్రెస్‌లో ఉంటే గెల‌వ‌లేమ‌నే ఉద్దేశంతోనే ఈమె బీజేపీలో చేరారు. ఇలా చాలా మంది నేత‌లు వ‌ల‌స వెళ్లారు.

మ‌రోవైపు మంథ‌నిలో కాంగ్రెస్ రెండు సీట్లు మాత్ర‌మే గెలిచింది. ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత శ్రీధ‌ర్‌బాబు
నియోజ‌క‌వ‌ర్గానికి రావ‌డం త‌గ్గించేశార‌ట‌. మున్సిప‌ల్ ఎన్నిక‌ల టైమ్‌లో క‌నీసం కేడ‌ర్ ను కూడా ప‌ట్టించుకోలేద‌ట‌.దీంతో మంథ‌నిలో కాంగ్రెస్ డీలా ప‌డిపోయింద‌ట‌.

ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి జ‌గిత్యాల‌లో ఫైట్ ఇచ్చారు. ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గానికే మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. కానీ క‌రీంన‌గ‌ర్ లో ఇత‌ర చోట్ల అస‌లు ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు పెద్ద‌ప‌ల్లి, సుల్తానాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే విజ‌య‌ర‌మ‌ణారావు టీఆర్ఎస్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. సుల్తానాబాద్ ఆరు సీట్ల‌లో గెలిచారు. పెద్ద‌ప‌ల్లిలో కూడా ఫైట్ ఇచ్చారు.

ధ‌ర్మ‌పురిలో ల‌క్ష్మ‌ణ్ కూడా నువ్వానేనా అన్న‌ట్లు మంత్రి ఈశ్వ‌ర్‌తో పోరాడారు. కానీ ఈ ముగ్గురు కీల‌క నేత‌లు మాత్రం త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో అనుకున్నంత పోరాటం చేయ‌లేదు. ఇదే ప‌రిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ రోజురోజుకు దిగ‌జార‌డానికి కార‌ణ‌మ‌వుతుంద‌నే విమ‌ర్శ‌లు జిల్లాలో విన్పిస్తున్నాయి.