టీఆర్ఎస్ గెలుపుకి… కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదేనట!

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది టీకాంగ్రెస్ పరిస్థితి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా కనీసం పోరాటం కూడా చేయకపోవడంతో… బీజేపీ… కాంగ్రెస్ ను బీట్ చేసి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు నిండా మునిగాక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తమ ఓటమికి కొత్త కారణం చెబుతున్నారు.

మంగళవారం గాంధీభవన్ లో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మిషన్ భగీరథ, లిక్కర్ స్కామ్ లో సంపాదించిన సొమ్మును మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించడం వల్లే టీఆర్ఎస్ కు ఇన్ని మున్సిపాలిటీలు దక్కాయని ఉత్తమ్ సంచలన ఆరోపణలు చేశారు.

టీఆర్ఎస్ విజయానికి ఓట్ల తారుమారు ప్రధాన కారణమని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ కొన్ని రోజులుగా ఓటర్ల జాబితాలను ఎన్నోసార్లు మార్చారని.. టీఆర్ఎస్ కు అనుకూలంగా పావులు కదిపారని సంచలన ఆరోపణలు చేశారు.

టీఆర్ఎస్ పకడ్బందీగా ప్లాన్ చేసి గెలిచిందని.. వార్డుల రిజర్వేషన్, నామినేషన్ల మధ్య సమయం లేకుండా చేసి ప్రత్యర్థి పార్టీలు నాయకులను ఎంపిక చేసుకోకుండా చేసి కుట్ర పన్నిందని ఉత్తమ్ ఆరోపించారు. నేరేడుచర్లలో 15 సీట్లకు కాంగ్రెస్ కూటమి 8సీట్లు గెలిచినా ఎక్స్ ఆఫీషియోతో టీఆర్ఎస్ దొంగతనంగా గెలిచిందని అన్నారు. టీఆర్ఎస్ విజయానికి ఇలాంటి అక్రమాలే కారణమని ఆరోపించారు.