ఉరి ఎలా వేసుకోవాలో చూపించబోయాడు… అతనే బలయ్యాడు!

సరదాగా.. చేసిన ఓ ప్రయత్నం ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్యకు ఓ కొత్త విషయం చెబుదామని చేసిన యత్నం.. విషాదాంతమైంది. భర్తను కాపాడుకునేందుకు ఆ ఇల్లాలు పడిన ఆరాటం.. వృథా ప్రయాసే అయ్యింది. ఈ విషాద ఘటన.. తమిళనాడులోని మదురై జిల్లా చోళైయళగుపురంలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చోళైయళగుపురానికి చెందిన మహ్మద్ అలీకి రెండు నెలల క్రితం పెళ్లయ్యింది. అతని వయస్సు కేవలం 22 ఏళ్లే. తన భార్యతో ఓ సందర్బంలో సరదాగా మాట్లాడుతున్న అతను.. ఉరి గురించి ప్రస్తావించాడు. అసలు ఉరి ఎలా వేసుకుంటారన్నది చేసి చూపించే ప్రయత్నం చేశాడని అక్కడి వాళ్లు చెబుతున్నారు.

ఇలా ప్రయోగం చేసే సమయంలోనే.. పట్టు తప్పి కుర్చీ జారిన కారణంగా.. అలీ మెడకు ఉరి బిగుసుకుందని తెలుస్తోంది. అది కాస్త బిగుతుగా ఉన్న కారణంగా.. వెంటనే అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లాడనీ.. భార్య ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణం విడిచాడని తెలిసింది.