ఇంకోసారి అలాంటి తప్పు జరగదు

ఖమ్మంలో జరిగిన ఆడియో ఫంక్షన్ లోనే నర్తనశాల సినిమాపై రియాక్ట్ అయ్యాడు నాగశౌర్య. జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా ఆ సినిమాను చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అశ్వథ్థామ సినిమా ప్రమోషన్ లో మరోసారి నర్తనశాల గురించి మాట్లాడాడు. ఇంకోసారి అలాంటి తప్పు చేయనంటున్నాడు. అసలు నర్తనశాల ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు.

“మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎలా ఉంటుందో.. అలా 6 నెలలపాటు అంతగా బాధపడ్డాం ఆ సినిమా రిజల్ట్ తో. నేను మా అమ్మా నాన్న పరువు, డబ్బు పోగొట్టేశాననిపించింది. వాళ్ళు నాకోసం ఈ ఇండస్ట్రీకి వచ్చారు. నా వల్ల ఫ్లాప్ వచ్చిందని కనీసం నన్ను బ్లేమ్ చేయకపోవడం నన్ను ఇంకా బాధపెట్టింది. ఇంకోసారి అలాంటి తప్పు జరగదు. ఆ సినిమా ఆడదని ముందే గెస్ చేశా. దర్శకుడికి మాట ఇచ్చా కాబట్టే.. ఆ మాట కోసం ఆ సినిమా చేశా. మహా అయితే డబ్బులు పోయాయి కానీ మాట మీద నిలబడ్డా అది చాలు.”

అశ్వథ్థామ సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంటుందంటున్నాడు శౌర్య. రాక్షసుడు, ఖాకీ, ఖైదీ సినిమాలు చూసిన ఫీలింగ్ కూడా కలుగుతుందంటున్నాడు. కావాలనే రియలిస్టిక్ గా ఉండేందుకు ప్రయత్నించామని, ఫిక్షన్ యాడ్ చేస్తే ఈ కథ వర్కవుట్ అవ్వదని అంటున్నాడు.

“అశ్వథ్థామ సినిమా చూసినప్పుడు రాక్షసుడు, ఖాకీ, ఖైదీ సినిమాల ఫీల్ కలుగుతుంది. అలా కలిగిందంటే మేం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఖాకీ సినిమాను ఆరేళ్లు రీసెర్చ్ చేసి తీశారు. రాక్షసుడు, ఖైదీ సినిమాలు కూడా అలాంటివే. ఆ సినిమాల టైపులోనే ఫిక్షన్ తగ్గించి, రియలిస్టిక్ గా కథను చెప్పాం.”

ఈవీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది అశ్వథ్థామ. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో రమణతేజ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.