ఫిబ్ర‌వ‌రి 1 నుంచి జ‌గ‌న్ ప‌ల్లెబాట !

ర‌చ్చ‌బండ త‌ర‌హా కార్యక్ర‌మానికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ శ్రీకారం చుట్ట‌బోతున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టారు. వాటి అమలు, పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.

ఇందుకోసం ప‌ల్లెబాట కార్యక్ర‌మాన్ని చేప‌ట్ట‌బోతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జ‌గ‌న్ పర్య‌టించ‌బోతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలన్నదే ఈ పర్యటన ప్రధాన ఉద్ధేశం.

ఇప్ప‌టికే గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాయి. ఆరు నెల‌ల్లో ప్ర‌వేశ‌పెట్టిన చాలా ప‌థ‌కాలు గ్రామీణ ప్ర‌జ‌లకు ఉప‌యోగ‌ప‌డేవి. దీంతో వాటి అమ‌లు, ల‌బ్ధిదారుల మ‌నోభావాలు తెలుసుకునేందుకు జ‌గ‌న్ ఈ ప‌ల్లెబాట ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు స్థానిక ఎన్నికలు కూడా ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయి. పంచాయతీలు, జిల్లా పరిషత్తులు మొత్తానికి మొత్తం గెలుచుకోవాలని జగన్ ఆశిస్తున్నారు. పార్టీని రీచార్జి చేయడం ద్వారానే అది సాధ్యం. ఇలా పల్లె బాటకు వెళ్తూనే మరో వైపు పార్టీని కూడా బలోపెతం చేయలనేది జగన్ ఎత్తుగడగా ఉంది.

సీఎం అయిన త‌ర్వాత రెండు మూడు ప‌థ‌కాల ప్రారంభోత్స‌వాల ద్వారా ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. కానీ పూర్తిస్థాయిలో ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌లేదు. ఇప్పుడు ప‌ల్లెబాట కార్యక్రమం ద్వారా మ‌ళ్లీ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు జ‌గ‌న్ వ‌స్తున్నారు. దీంతో మ‌ళ్లీ ప్ర‌తిప‌క్షాల‌కు ప‌ని ప‌డ్డ‌ట్లే. జ‌గ‌న్ ఒక్క‌సారి జ‌నంలో కి వ‌స్తే ఆ పరిస్థితులు వేరు. సీఎం హోదాలో ఆయ‌న ప్ర‌జ‌ల‌తో ఎలా క‌లుస్తారో చూడాలి.