Telugu Global
National

బడ్జెట్ దెబ్బకు పాతాళానికి పడిపోయిన స్టాక్ మార్కెట్లు..!

బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏ బడ్జెట్ ప్రవేశ పెట్టినా స్టాక్ మార్కెట్లు ఉరుకులు పరుగులు పెడుతుంటాయి. ఎన్నికల ఫలితాలైనా, కొత్త బడ్జెట్ రోజైనా ఆరోజు మార్కెట్లకు పండగే. కాని ఈ సారి దలాల్ స్ట్రీట్ ఉలిక్కిపడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రారంభమైన మార్కెట్ల పతనం అలా కొనసాగుతూనే ఉంది. ఎన్నడూ లేనిది సెక్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలతో పాతాళంలోనికి పడిపోయాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ […]

బడ్జెట్ దెబ్బకు పాతాళానికి పడిపోయిన స్టాక్ మార్కెట్లు..!
X

బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏ బడ్జెట్ ప్రవేశ పెట్టినా స్టాక్ మార్కెట్లు ఉరుకులు పరుగులు పెడుతుంటాయి. ఎన్నికల ఫలితాలైనా, కొత్త బడ్జెట్ రోజైనా ఆరోజు మార్కెట్లకు పండగే. కాని ఈ సారి దలాల్ స్ట్రీట్ ఉలిక్కిపడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రారంభమైన మార్కెట్ల పతనం అలా కొనసాగుతూనే ఉంది. ఎన్నడూ లేనిది సెక్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలతో పాతాళంలోనికి పడిపోయాయి.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‌సభలో అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. అయితే ఈ సారి బడ్జెట్‌లో పలు రంగాలకు ఊరట కలిగించే అంశాలు ఉంటాయని అందరూ భావించారు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఆర్థిక మందగమనం కారణంగా అమ్మకాలు లేక నష్టాలు తెచ్చుకుంటున్న ఆటోమొబైల్ రంగం, రియల్ ఎస్టేట్ రంగాల పునరుజ్జీవానికి ఉపయోగపడే ఉద్దీపన ఉంటుందని భావించారు. కాని దాని ఊసే లేకుండా పోయింది. దీంతో ఈ రెండు రంగాల షేర్లు భారీగా పతనం అయ్యాయి.

దీనికి తోడు కొత్త పన్ను విధానం ప్రకటించడం.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రెండు ఆప్షన్లు ఇవ్వడంతో ఇన్స్యూరెన్స్ కంపెనీలపై ఆ ప్రభావం పడింది. కొత్త పన్ను విధానంలో ఎలాంటి రిబేట్లు ఉండవని ఆర్థిక మంత్రి ప్రకటించారు. గతంలో పన్ను మినహాయింపుల కోసం ఇన్స్యూరెన్స్ పాలసీల వైపు చెల్లింపుదారులు మొగ్గు చూపే వాళ్లు. ఈ సారి 80(సీ) కింద మినహాయింపులు రద్దు చేయడం.. ఎల్ఐసీలో వాటాల విక్రయం ఇన్స్యూరెన్స్ కంపెనీల షేర్లు పతనం అవడానికి కారణమయ్యాయి.

మదుపర్ల భయాందోళన కారణంగా అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సెన్సెక్స్ 1073 పాయింట్లు నష్టపోయి 39,649 వద్ద, నిఫ్టీ 319 పాయింట్ల నష్టంతో 11642 పాయింట్ల వద్ద ముగిసింది.

సాధారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేస్తాయి. కాని ఈ సారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో శనివారం కూడా మార్కెట్లు తెరిచారు. బడ్జెట్ వల్ల మార్కెట్లు లాభాలను అర్జిస్తాయని తెరిస్తే.. చివరకు అత్యంత నష్టాలను మూటగట్టుకోవడం మార్కెట్ వర్గాలను నివ్వెరపరిచింది.

First Published:  1 Feb 2020 6:01 AM GMT
Next Story