మరో వివాదం లో యాంకర్ ప్రదీప్ !

యాంకర్‌ ప్రదీప్‌పై ఓ యువ దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన వారు సినిమాలో న‌టించ‌డం నేరం. ఈ నిబంధ‌న ప్ర‌కారం ప్రదీప్ కూడా సినిమాలో న‌టించొద్ద‌ని అంటున్నాడు ఈ యువ ద‌ర్శ‌కుడు.

ప్ర‌స్తుతం ప్ర‌దీప్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని …ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో దర్శకుడు శ్రీ రామోజు సునిశిత్ ఫిర్యాదు చేశాడు. సునీశిత్‌ది మేడ్చల్‌ జిల్లా కీసర.

’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో హీరో గా ప్రదీప్ న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్ మొద‌లైంది. ప్రదీప్‌ గతంలో ఒక అమ్మాయిని వేధించిన ఘటనలో రెండు రోజులు జైలుకు వెళ్లివచ్చారని ఫిర్యాదులో ద‌ర్శ‌కుడు పేర్కొన్నారు.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రదీప్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడని ఆరోపించారు. ప్రదీప్‌తో పాటు సినీ దర్శకుడు కూడా నిబంధనలను అతిక్రమించారనేది ఈ ద‌ర్శ‌కుడి ఆరోప‌ణ‌.

ఈ ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు…న్యాయస‌ల‌హా కోసం పంపారు. న్యాయ స‌ల‌హా అందిన త‌ర్వాత కేసు న‌మోదు చేయాలా? వ‌ద్దా? అనే దానిపై నిర్ణ‌యం తీసుకోనున్నారు.