రాజధాని రైతులకు సీఎం వరాలు… ఆనందంలో అన్నదాతలు

ఇన్నాళ్లూ.. అమరావతి రైతులు ఆందోళనలు చేయడమే చూశాం. ఈ పరిస్థితి.. ఇవాళ కాస్త మారింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో.. ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు.

నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన అన్నదాతలు.. సీఎంతో సమావేశమయ్యారు. వారి ఆందోళనను వెలిబుచ్చారు. రాజధాని తరలింపుపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించారు.

రాజధాని ప్రాంత రైతులకు కౌలు మొత్తాన్ని 2 వేల 500 నుంచి 5 వేలకు పెంచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా.. రైతులు చెప్పిన విషయాలను ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకున్నారు. పరిష్కరించదగిన విషయాలపై.. అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. బలవంతపు భూ సేకరణ నుంచి తమ గ్రామాలకు మినహాయింపు ఇవ్వాలని రైతులు కోరగా.. వారం నుంచి పది రోజుల్లోపు ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మంగళగిరి, తాడికొండలో బలవంతంగా 5 వేల ఎకరాలు సేకరించినందుకు సంబంధించిన ఆదేశాలు వెనక్కు తీసుకోవాలని చెప్పారు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో.. రిజర్వ్ జోన్లు ఎత్తివేసేందుకు కూడా.. ముఖ్యమంత్రి ఆమోదించారు. అలాగే.. మంగళగిరి నియోజకవర్గ గ్రామాల్లో రహదారుల అభివృద్ధి పనులు 3 నెలల్లో పూర్తి చేయాలని.. 6 ఎత్తిపోతల పథకాల మోటార్ పైపుల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశిస్తూ.. ఇందుకోసం నిధులను కూడా విడుదల చేశారు.

రైతులతో మరిన్ని విషయాలపై.. సానుకూలంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. 3 రాజధానుల నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్నది వివరించారు. అమరావతి రాజధానిగానే కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లోనూ రాజధాని ఉంటే.. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని రైతులకు ముఖ్యమంత్రి వివరించారు.

ముఖ్యమంత్రి స్పందించిన తీరుపై..  రైతులు హర్షం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ నుంచి తమ గ్రామాల తొలగింపునకు సీఎం హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఇన్నాళ్లుగా.. అమరావతి కోసం జరుగుతున్న ఆందోళనలు.. తాజా పరిణామంతో మరో టర్న్ తీసుకున్నాయని చెప్పవచ్చని.. రాజధాని పరిధిలోని గ్రామాల రైతులే సీఎం నిర్ణయాన్ని స్వాగతించడం కీలక మార్పుగా భావించవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.