కవిత రాజకీయ భవిష్యత్ కు ఎంపీ అరవింద్ పోటు.. నిజామాబాద్ కు స్పైస్ బోర్డు

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కూతురు కవితను ఓడించడంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు దొరికిన ప్రధాన ఆయుధం.. పసుపుబోర్డు, ఎర్రజొన్నలకు మద్దతు ధర.

అయితే తనను గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న అరవింద్ మాట తప్పడంతో… ఈ ఏడు నెలల్లో ఆయనను టీఆర్ఎస్ టార్గెట్ చేసి రచ్చ చేసింది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇరుకునపెట్టింది.

నిజామాబాద్ ఎంపీగా గెలిస్తే పసుపు బోర్డు, మద్దతు ధర తెస్తానని హామీ ఇచ్చిన అరవింద్ కు వాటిని కేంద్రం నుంచి సాధించడం సవాల్ గా మారింది. ఇజ్జత్ కా సవాల్ గా మారిన ఈ టాస్క్ ను ఎంపీ అరవింద్ ఎట్టకేలకు సాధించారు.

తాజాగా నిజామాబాద్ లో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు (స్పైస్) కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ లో ప్రకటించారు. ఈ బోర్డు పసుపు పంట ఎగుమతులపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తుందని.. పసుపు సహా మిగిలిన మసాలా దినుసుల కోసం కూడా ఈ కార్యాలయం పనిచేస్తుందని పీయూష్ తెలుపడంతో… నిజామాబాద్ ఎంపీ అరవింద్ సహా ఇక్కడి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు.

రైతులకు అంతర్జాతీయ బయ్యర్లతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలు లభించేలా ఈ బోర్డు తోడ్పడుతుందని.. నిజామాబాద్ రైతులు కోరిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలే కల్పించామని పీయూష్ ప్రకటించడం సంచలనంగా మారింది.

కాగా పసుపు బోర్డు సహా మద్దతు ధరను కేంద్రం ప్రకటించడంతో… బీజేపీ ఎంపీ అరవింద్ మాట నెగ్గినట్టైంది. దీంతో ఇక్కడి నుంచే వచ్చేసారి కూడా పోటీచేయాలనుకున్న కవితకు ఎంపీ అరవింద్ షాకిచ్చినట్టైంది. కవిత రాజకీయ భవిష్యత్తుకు అరవింద్ పోటు పొడిచినట్టు అయ్యింది. మరి మళ్లీ కవిత ఇక్కడి నుంచే పోటీచేస్తుందా లేక మెదక్ కు మారుతుందా అనేది ఉత్కంఠగా మారింది.