మకాం మార్చేసిన పవన్… ఇక హైదరాబాద్ నుంచే..

జనసేనాని పవన్ కళ్యాణ్ మకాం మార్చేశారు. ఇక తన సమావేశాలు, సమీక్షలు అన్ని హైదరాబాద్ నుంచే అని చెప్పకనే చెప్పేశారు. ఇన్నాళ్లు పొద్దున హైదరాబాద్ లో ‘పింక్’ సినిమా షూటింగ్ నిర్వహించి…. సాయంత్రం అమరావతిలో పార్టీ కార్యక్రమాలు చూసుకునే వారు. నాలుగు రోజులకే అలిసిపోయారేమో కానీ.. తాజాగా తన మకాంను పూర్తిగా హైదరాబాద్ కు షిఫ్ట్ చేసినట్టు తాజా ప్రకటనతో తేటతెల్లమైంది.

కర్నూలు జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టు జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. కర్నూలు నాయకుల కోరిక మేరకు అమరావతిలో కాకుండా హైదరాబాద్ లో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

దీన్ని బట్టి జనసేనాని తన మకాంను మెల్లిమెల్లిగా అమరావతి నుంచి హైదరాబాద్ కు మారుస్తున్నట్టు అర్థమవుతోంది. దీనికి రెండు కారణాలు చెబుతున్నారు.

ఒకటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజకీయాలు చేయలేని పరిస్థితి. అలా అని వదిలేయలేని స్థితి. అందుకే పవన్ రాజకీయ భేటీలను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేస్తున్నారు. నేతలను ఇక్కడికే రమ్మంటున్నారు.

ఇక అమరావతికి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ కు కర్నూలులో అడుగుపెడితే నిరసనల సెగ తప్పదు. అందుకే అక్కడి నేతలనే హైదరాబాద్ రప్పించి ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు.

దీన్ని బట్టి ఇక జనసేనాని అమరావతి నుంచి తన మకాంను హైదరాబాద్ కి మార్చేసినట్టే కనిపిస్తోంది. ఇకనుంచి పవన్ పాలిటిక్స్ కు కొద్ది సమయం మాత్రమే కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.