తెలంగాణలో బీజేపీ కొత్త అస్త్రం… పవన్ కళ్యాణ్

నేతలందరినీ పరీక్షించారు. అధ్యక్ష పీఠాలను మార్చారు. అయినా తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న ఆశ మాత్రం కమలనాథులకు తీరడం లేదు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా నేతలందరూ మారినా బీజేపీ తలరాత మాత్రం తెలంగాణలో మారడం లేదట.. అందుకే ఇప్పుడు సరికొత్త అస్త్రాన్ని తెలంగాణ బీజేపీ తెరపైకి తెస్తోందట.. ఇది ఢిల్లీ పెద్దల స్కెచ్చే అంటున్నారు.

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో తురుపుముక్కగా ఎంచుకోవాలని తెలంగాణ బీజేపీ పెద్దలు స్కెచ్ గీస్తున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేయించాలని బీజేపీ నిర్ణయించిందట..

ఈమేరకు తెలంగాణ బీజేపీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ఇటీవల జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కీలక సమావేశాన్ని నిర్వహించినట్టు సమాచారం. వీరిద్దరి భేటి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రాబోయే నాలుగేళ్ల వరకూ తెలంగాణలో పెద్ద ఎన్నికలు లేవు. ఈ కాలాన్ని పార్టీని బలోపేతం చేయడానికి.. పార్టీని నిర్మించడానికి సమర్థవంతంగా వాడుకోవాలని బీజేపీ పెద్దలు వ్యూహాలు పన్నారట.. పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే బీజేపీకి తెలంగాణలో అవకాశాలు బాగా మెరుగుపడుతాయని భావిస్తున్నారట..

మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు లక్ష్మణ్ జనసేనాని పవన్ ను ఒప్పించినట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగిందని.. కాంగ్రెస్ ను తుత్తునియలు చేసి రెండో స్థానంలోకి వచ్చిందని.. పవన్ పార్టీ కోసం ప్రచారం చేస్తే బీజేపీ గణనీయంగా పుంజుకుంటుందని ఒప్పించినట్టు తెలిసింది.