జగన్ ఉద్వేగం…. భవిష్యత్ తరాలకు అన్యాయం చేయాలా?

ఏపీ సీఎం జగన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. విజయవాడలో ఓ జాతీయ దినపత్రిక నిర్వహించిన ‘విద్యా సమావేశంలో’ సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు. అమరావతి కంటే చాలా తక్కువ ఖర్చుతో విశాఖలో పరిపాలన సాగుతుందని.. అభివృద్ధికి ఉత్తమమైన నగరంగా విశాఖ నిలుస్తుందని జగన్ అన్నారు.

విశాఖపట్నంలో ఇప్పటికే ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఉన్నాయని.. అభివృద్ధి చెందిన నగరమని.. అమరావతిని నిర్మించడానికి అవసరమైన నిధుల్లో కేవలం 10శాతం మాత్రమే వెచ్చిస్తే ప్రపంచంలోనే ఉత్తమ రాజధానిగా విశాఖను చేయవచ్చని జగన్ వ్యాఖ్యానించారు.

వచ్చే పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు లేదా చెన్నైతో పోటీపడగల సత్తా కేవలం ఏపీలో విశాఖపట్నంకు మాత్రమే ఉందని.. పోటీపడుతుందని ఖచ్చితంగా చెప్పగలనంటూ జగన్ తెలిపారు.

తాను కనుక ఏపీ రాజధానిగా విశాఖను మార్చకపోతే, నిర్ణయం తీసుకోకపోతే అది ఏపీ భవిష్యత్ తరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని సీఎం జగన్ ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.తాను కనుక ఇప్పుడు విశాఖపై వెనక్కి తగ్గితే భవిష్యత్ తరాలకి పెద్ద అన్యాయం చేసిన వాడిని అవుతానని జగన్ స్పష్టం చేశారు.

అమరావతిని మార్చడం లేదని.. ఇది శాసన రాజధానిగా ఉంటుందని.. అసెంబ్లీ ఇక్కడే ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలున్న విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందన్నారు. వికేంద్రీకరణతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్నారు. 1.9 లక్షల కోట్లు పెట్టి అమరావతిని కట్టలేమని… ఏడాదికి 5వేల కోట్లకు మించి ఏపీ ఖర్చు భరించలేదని.. అందుకే అమరావతిని వదిలి విశాఖ నుంచి పాలించబోతున్నామని జగన్ తెలిపారు.