ప్రియురాలి పేరిట‌ లైవ్ సెక్స్ బిజినెస్ !

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్ వెలుగుచూసింది. హైద‌రాబాద్ లోని అంబ‌ర్‌పేట‌కు చెందిన యువ‌కుడు గౌలిగూడ‌కు చెందిన యువ‌తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. క‌ర్నాట‌క‌లో గుడిలో పెళ్లి చేసుకుని..తిరిగి సిటీకి వ‌చ్చి కాపురం మొద‌లుపెట్టాడు. ఆత‌ర్వాత కొన్నాళ్లు మంచిగానే యువ‌కుడు వ్య‌వ‌హారం న‌డిపాడు. ఈ లోపు ఆమెకు తెలియ‌కుండా… ఆమె పేరు, ఫొటో వినియోగించి ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ ఖాతా తెరిచాడు. అందులో లైవ్‌ సెక్స్‌ చాట్‌ అంటూ పలువురికి వ‌ల వేశాడు.

మొదటి సారి ట్ర‌య‌ల్ చేసి నాలుగు డ‌బ్బులు సంపాదించాడు. అంతే బిజినెస్ బాగుంంద‌ని ఆమెపేరుతో ఇన్‌స్ట్రాగామ్‌లోనే మేసేజ్‌లు పెడుతూ… ప‌లువురితో కాంట్రాక్ట్‌లు న‌డిపాడు. త‌న‌తో లైవ్ సెక్స్‌ చాట్‌ చేయాలంటే కొంత మొత్తం డిపాజిట్‌ చేయాలంటూ అతగాడు తన గూగుల్‌ పే ఖాతా నంబర్‌ ఇచ్చాడు. ఇది నమ్మిన ఎంతో మంది రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లించారు.

ఆపై కొన్ని రోజులు వారితో ఆ యువతి మాదిరిగా చాటింగ్‌ చేసేవాడు. ఆ త‌ర్వాత ఫోన్ నెంబ‌ర్ మార్చేవాడు. వేరే ఫోన్ నెంబ‌ర్ తీసుకుని మ‌ళ్లీ కొత్త‌గా ఖాతా తెరిచేవాడు. మ‌ళ్లీ మ‌రికొంత‌మందికి వ‌ల వేసేవాడు. ప్రతి నెలా తన సెల్‌ఫోన్‌ నంబర్‌ మారుస్తూ, కొత్త ఇన్‌ స్టాగ్రామ్‌ ఖాతా ఓపెన్‌ చేస్తూ వచ్చాడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ దందా చేసిన అతగాడు రెండు నెలల క్రితం హఠాత్తుగా క‌నిపించ‌కుండాపోయాడు.

యువ‌తికి చెప్ప‌కుండా గాయ‌బ్ కావ‌డంతో ఆరా తీస్తే…అస‌లు విష‌యం తెలిసింది. ఇన్‌స్ట్రాగామ్‌లో తన ఫొటో, పేరుతో కొన్ని అకౌంట్లు తెరిచి.. అశ్లీల చాటింగ్స్ చేసి డ‌బ్బు సంపాదించి అదృశ్య‌మైన‌ట్లు యువ‌తి గుర్తించింది. వేరే యువ‌తిని తీసుకుని ఉడాయించిన‌ట్లు క‌నుగొంది. దీంతో గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు దర్యాప్తు ప్రారంభించారు.