పెద్దల స‌భ‌పై క‌విత‌ గురి…. సీటు కోసం పోటాపోటీ !

మున్సిప‌ల్ ఎన్నిక‌లు ముగిశాయి. కొంద‌రికి ప‌ద‌వులు ద‌క్కాయి. ఇప్పుడు పెద్ద‌లు కొంద‌రు పెద్ద‌ల స‌భ‌పై క‌న్నేశారు. త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ‌, ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గబోతున్నాయి. ఇక్క‌డ సీట్ల కోసం అప్పుడే పోటీ మొద‌లైంది.

మార్చి రెండున కొన్ని రాజ్య‌స‌భ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. మ‌రో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. జూన్‌లో మ‌రో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ ఆరు స్థానాల‌కు సుమారు 20 మంది లీడ‌ర్లు పోటీ ప‌డుతున్నారు. ఈసారి త‌మ‌కే ప‌క్కాగా సీటు వ‌స్తుంద‌నే ఆశ‌లో ప‌లువురు నేత‌లు ఉన్నారు.

తెలంగాణ కోటాలో ఉన్న రాజ్య‌స‌భ సభ్యులు కేవీపీ, గ‌రిక‌పాటి మోహ‌న్‌ రావుల ప‌ద‌వీకాలం మార్చిలో ముగుస్తోంది. అటు ఏపీ కోటాలో ఉన్న కేశ‌వ‌రావు స‌భ్య‌త్వం గ‌డువు కూడా ద‌గ్గ‌ర‌ప‌డింది. ఇప్పుడు టీఆర్ఎస్‌కు ద‌క్కే ఈ రెండు సీట్లు ఎవ‌రికి ఇస్తార‌నే చ‌ర్చ మొద‌లైంది. ఒక సీటు మాజీ ఎంపీ క‌వితకు ఇస్తార‌ని తెలుస్తోంది.

రాజ్య‌స‌భ సీటు కోసం కొంత‌కాలంగా ఆమె అల‌క వ‌హించార‌ని గులాబీ వ‌ర్గాలు అంటున్నాయి. ఆమెకు లేదా ఓ రెడ్డికి…ఓ ఎస్సీకి సీటు ఇస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ బీసీవ‌ర్గాలు, ఇత‌ర వ‌ర్గాల‌కు టికెట్లు అందాయి. రాజ్య‌స‌భ కోటాలో రెడ్డి, ఎస్సీ వ‌ర్గానికి సీటు ద‌క్క‌లేదు.

క‌వితకు ఇవ్వ‌క‌పోతే రెడ్డి వ‌ర్గంలో మాజీ స్పీక‌ర్ సురేష్ రెడ్డికి చాన్స్ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈయ‌న‌కు రాజ్య‌స‌భ లేదా నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీ ఇస్తార‌ని స‌మాచారం. ఇటు మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నా చారి, మాజీ మంత్రి నాయిని న‌ర్సింహ్మారెడ్డి రాజ్య‌స‌భ రేసులో ఉన్నారు.

ఇటు ఎమ్మెల్సీల కోసం పెద్ద లిస్ట్ వెయిటింగ్‌లో ఉంది. మాజీ మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, జూప‌ల్లి కృష్ణారావుతో పాటు టీఆర్ఎస్‌లో ఇత‌ర ఆశావ‌హులు ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టినుంచే కేసీఆర్‌, కేటీఆర్‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు.