నాగశౌర్య మనోభావాలు దెబ్బతీశాడా?

మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు నాగశౌర్య. ఈసారి ఏపీ, తెలంగాణ డ్రైవర్ల సంఘం అతడిపై కోపం వ్యక్తంచేస్తోంది. ఓ ఇంటర్వ్యూలో నాగశౌర్య తమ మనోభావాలు కించపరిచాడని ఆరోపిస్తోంది డ్రైవర్ ల సంఘం. ఈ మేరకు మానవ హక్కుల సంఘంలో నాగశౌర్యపై ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు.

అశ్వథ్థామ సినిమాలో డ్రైవర్లను అసభ్యంగా, నీచులుగా చూపించాడట నాగశౌర్య. అది సినిమా కాబట్టి దానిపై తమకు ఎలాంటి కంప్లయింట్స్ లేవంటున్నారు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డ్రైవర్లను చదువురాని వారు, తాగుబోతులు అనే అర్థం వచ్చేలా మాట్లాడాడట నాగశౌర్య. దీనిపై డ్రైవర్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించినట్టు డ్రైవర్ల జేఏసీ ఛైర్మన్ షేక్ సలావుద్దీన్ ప్రకటించారు.

నాగశౌర్యకు వివాదాలు కొత్తకాదు. గతంలో సాయిపల్లవికి తలబిరుసు ఎక్కువంటూ సంచలన ప్రకటన చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. తాజాగా తన ఛలో దర్శకుడు వెంకీ కుడుముల నమ్మకద్రోహి అంటూ అతిపెద్ద ఆరోపణ చేశాడు. వెంకీ కుడుములతో వివాదం ఇంకా వేడివేడిగా ఉంటుండగానే.. ఇప్పుడిలా డ్రైవర్ల సంఘం ఆగ్రహానికి గురయ్యాడు ఈ హీరో. చూస్తుంటే.. నాగశౌర్య మీడియా ముందు కాస్త ఎమోషనల్ అవుతున్నట్టున్నాడు.