ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు అందుకే వెళ్లడం లేదా?

చంద్రబాబుకు, ఎన్టీఆర్ భవన్ కు విడదీయరాని బంధం ముడిపడి ఉంది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకోవడం.. టీడీపీని ఇంత బలంగా మార్చడంలో.. రాజకీయం చేయడంలో అన్నింటికి వేదిక హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవనే.

సాధారణంగా టీడీపీ అధినేతగా చంద్రబాబు ప్రతి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాడు. కొంత కాలంగా దాన్నే రూల్ గా పెట్టుకున్నాడు. నాయకులు, కార్యకర్తలకు ప్రతి శుక్రవారం ఎన్టీఆర్ భవన్ లో సమయం కేటాయిస్తాడు. తరువాత హైదరాబాద్ లో కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడు. ప్రతీ సోమవారం ఉదయం తిరిగి విజయవాడకు తిరిగి వస్తున్నాడు.

కాగా గత శుక్రవారం కూడా చంద్రబాబు హైదరాబాద్ వచ్చాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ భవన్ ను సందర్శించి కార్మికులతో సంభాషిస్తారని ఎన్టీఆర్ భవన్ నుంచి సమాచారం వచ్చింది. అయితే చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ భవన్ కు రాకుండా ఇంటికే పరిమితం అయ్యాడు.

చంద్రబాబు ఎందుకు తన ప్రణాళికలు మార్చుకున్నాడన్నది అంతుచిక్కని విషయంగా మారింది. అయితే తాజాగా ఇటీవల తన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఐడీ దాడులు కొనసాగుతుండడంతోనే చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు దూరంగా ఉన్నట్టు తెలిసింది. శనివారం సాయంత్రం వరకూ కొనసాగుతున్న ఐటీ దాడులపై సమీక్షించారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాడట.

చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్, లోకేష్ స్నేహితుడు కిలారు రాజేష్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు , ఇతరులపై ఐటీ దాడులు సాగుతున్నాయి. అందుకే చంద్రబాబు ఈ పరిణామాలతోనే బిజీగా ఆందోళనగా ఇంట్లోనే మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ భవన్ కు కూడా వెళ్లకుండా చంద్రబాబు ఇలా భయపడిపోవడం తొలిసారి అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.