సాయితేజ్ కు సుతారంగా చురకలు

ప్రస్తుతం సోలో బతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నాడు సాయితేజ్. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సోలో బతుకే చాలా బాగుందంటూ వరుసగా ట్వీట్లు పెడుతున్నాడు. అందులో భాగంగా ఓ ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ పై టాలీవుడ్ హీరోలంతా రియాక్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా మంచు విష్ణు పెట్టిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.

సోలో బతుకే సో బెటర్ అంటూ ట్వీట్ చేశాడు సాయితేజ్. ఆ కింద చాలా రాసుకొచ్చాడు. క్రికెట్ మధ్యలో వదిలేసి వచ్చేయాల్సిన అవసరం లేదని, సెల్ ఫోన్ చార్జింగ్ అయిపోతే టెన్షన్ పడాల్సిన పనిలేదని, రెస్టారెంట్ కు వెళ్తే మన బిల్లు మాత్రమే మనం కట్టుకోవచ్చని ఇలా చాలా పెట్టాడు. దీనిపై కాస్త సుతారంగా స్పందిస్తూనే చురకలంటించాడు మంచు విష్ణు.

సాయితేజ్ పెట్టిన ట్వీట్ ను సేవ్ చేసుకున్నట్టు ప్రకటించాడు విష్ణు. సాయితేజ్ ఇంకా ఎన్నేళ్ళు సోలోగా ఉంటాడో చూస్తానంటూ ట్వీట్ చేశాడు. దీనికి సాయితేజ్ కూడా ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు. అందరూ నీలా అదృష్టవంతులు కాలేరు బ్రదర్ అంటూ ట్వీటాడు. సాయితేజ్-మంచు విష్ణు మధ్య జరిగిన ఈ ఆసక్తికర చర్చ నెట్ లో వైరల్ అవుతోంది.